Gorati Venkanna: ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అపూర్వగౌరవం దక్కింది. 2021 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 'వల్లంకి తాళం' కవితా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపుగా 'వల్లంకి తాళం' కవిత సంపుటిని గోరటి తీర్చిదిద్దారు. కేంద్ర సాహిత్య పురస్కారం రావడంపై గోరటి వెంకన్న ఆనందం వ్యక్తంచేశారు.
గోరటి వెంకన్న తన కవిత్వంలో ప్రజల జీవితాలను కళ్లకు కట్టారు. జనం కష్ట సుఖాలను, వెతలను, హింసకు గురవుతున్న విధానాలను ఎలుగెత్తిచాటారు. 'వల్లంకి తాళం' కవితసంపుటిలోనూ గోరటి తన మార్కు చూపించారు. 'పల్లె కన్నీరు పెడుతుందో..' అంటూ ప్రపంచీకరణ వల్ల జరిగిన నష్టాన్ని హృదయాలను తాకేలా వివరించారు. 'గల్లీ సిన్నది పాటలో..' బస్తీ బతుకులను గోరటి వెంకన్న ఆవిష్కరించారు. 'పల్లెపల్లెన పల్లేర్లు మొలిసే పాటలో..' దుర్భర స్థితిలో ఉన్న తెలంగాణ పల్లె కష్టాలను వివరించారు. గోరటి పాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించాయి.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న.. వల్లంకి తాళంతో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు.
తగుళ్ల గోపాల్, దేవరాజు మహారాజుకు..
Sahitya Akademi Awards 2021: తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. దండకడియం కవితాసంపుటికి పురస్కారం దక్కింది. 'నేను అంటే ఎవరు' నాటకానికి దేవరాజు మహారాజుకు బాలసాహిత్య పురస్కారం వరించింది.
సీఎం జగన్ అభినందనలు..
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనవారికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్ తమ రచనలతో ప్రజల హృదయాలను గెలిచారన్నారు. బల్లడీర్ పాట ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
వెంకన్న సాహితీ సృష్టి చేశారు..: కేసీఆర్
KCR On Gorati Venkanna: గోరటికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోరటి వెంకన్నకు అభినందనలు తెలిపారు. ‘వల్లంకి తాళం' కవితాసంపుటికి అవార్డు దక్కడం హర్షణీయమన్నారు..కేసీఆర్. ఇందులో మనిషి, ప్రకృతి బంధాన్ని వెంకన్న ఆవిష్కరించారని ప్రశంసించారు. విశ్వ మానవుని వేదనకు వెంకన్న కవిత అద్దం పట్టిందని.. సామాజిక తాత్వికతతో వెంకన్న సాహితీ సృష్టి చేశారని కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను గోరటి విశ్వవ్యాప్తం చేశారన్న కేసీఆర్.. ఈ అవార్డు తెలంగాణ మట్టిమనిషి జీవన తాత్వికతకు దక్కిన గౌరవమని చెప్పారు.
ఇవీచదవండి :