బహిరంగ మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పు తెచ్చుకునేందుకు అనుమతి లభించింది. మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతిచ్చింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది. రుణ సేకరణ కోసం ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి తాజా నిర్ణయంతో ఊరట లభించినట్లయింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి అనుమతిచ్చిన పరిమితి మేరకు ఇప్పటికే రుణ స్వీకరణ పూర్తయింది. అనుమతికి లోబడి.. చివరి విడతగా రూ.1,000 కోట్లను గత మంగళవారం రుణంగా స్వీకరించింది.
దీంతో కేంద్రం విధించిన పరిమితికి చేరుకోవడంతో.. మున్ముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలు ఎలా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి కొత్తగా అప్పు పుట్టే మార్గం కనిపించింది.
దిల్లీలో వరుస ప్రయత్నాలు
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఆర్థిక శాఖ అధికారులు పదేపదే దిల్లీ వెళ్లి రుణ పరిమితి పెంపు కోసం ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను వివిధ కోణాల్లో వినిపించారు. అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా తీసుకున్న రుణాల కోత నుంచి ఈ ఏడాది మినహాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబరు వరకు ఉన్న రుణ పరిమితిని పెంచినట్లయింది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగినట్లైంది.
రుణ సేకరణకు షరతులు
*ఆంధ్రప్రదేశ్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.42,472 కోట్ల రుణం తీసుకునే అర్హత ఉందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నాలుగు శాతం మేర మాత్రమే రుణం పొందవచ్చు. అయితే, కేంద్రం ఇందులో అనేక షరతులు విధించింది. మూలధన వ్యయం నిర్దిష్ట పరిమితి మేరకు ఖర్చు చేస్తేనే ఇందులో 0.5 శాతం రుణం లభిస్తుందని పేర్కొంటూ.. ఆ మేరకు రూ.5,309 కోట్ల కోత పెట్టింది. మిగిలిన రూ.37,163 కోట్లకు.. ఇంతకుముందు రాష్ట్రం పొందిన రుణాలు తిరిగి చెల్లించినందున ఆ మేరకు రూ.14,429 కోట్లు అదనంగా చేర్చింది. దీంతో మొత్తం రుణ అర్హత రూ.51,592 కోట్లకు చేరింది.
* ఏటా రాష్ట్రం తన రుణ పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి వీల్లేదు. అయితే, ఏపీ గతంలోనే ఈ పరిమితిని దాటింది. ఆ మొత్తం విలువ రూ.17,923 కోట్లుగా తేలింది. అది మినహాయించగా.. కొత్తగా రుణ అర్హత రూ.33,668 కోట్లుగా తేల్చారు. ఇందులో నుంచి ఇతర రుణాల మొత్తం రూ.6,000.21 కోట్లు కోత పెట్టారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రుణ పరిమితిని రూ.27,668.68 కోట్లకు పరిమితం చేశారు. ఆ లెక్క ఆధారంగా తొలి తొమ్మిది నెలలకు రూ.20,751.51 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. ఆ పరిమితి మేరకు ఆగస్టు నెలాఖరు నాటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది.
*రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏప్రిల్, జులైలో రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాసి తమకు రుణ పరిమితి పెంచాలని కోరారు. గత ప్రభుత్వం పరిమితికి మించి చేసిన రుణాన్ని.. ప్రస్తుత ఏడాదిలో కోత పెట్టవద్దని ప్రస్తావించారు. వివిధ సమీకరణాలు, వాదనల తర్వాత కేంద్రం తాజాగా పరిశీలించి రాష్ట్ర రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగినట్లయింది. ఏ ప్రాతిపదికన రుణ మొత్తం పెంచిందో తెలియాల్సి ఉంది.
నేడు మరో రూ.2,000 కోట్ల అప్పు?
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో.. రాష్ట్రానికి రుణ పరిమితి పెరిగినందున కొత్తగా అప్పుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ఈ ప్రతిపాదనలను రిజర్వు బ్యాంకుకు సమర్పించింది. మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,000 కోట్ల రుణం సమీకరించనుంది. 18 ఏళ్ల కాల పరిమితితో రూ.వెయ్యి కోట్లు, 20 ఏళ్ల గడువుతో మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకోనుంది.
ఇదీ చదవండి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తాత్కాలికమేనా? : కాంట్రాక్టు ఉద్యోగులు