సౌర విద్యుత్ ఒప్పందాల్లో రూ.1.20 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉన్నందుకే హైకోర్టు టెండర్లు రద్దు చేసిందని... తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై మంత్రి బాలినేని, సలహాదారులు అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలు, బినామీల కోసం నిబంధనలన్నీ ఉల్లంఘించి జీవోలు విడుదల చేయటంతోపాటు... పీపీఏల కాలపరిమితిని 30 ఏళ్లకు పెంచారని ఆరోపించారు.
మొదటి దశ సౌర విద్యుత్ ఒప్పందాల్లో 6400 మెగావాట్ల టెండర్లలో ఎక్కువ అదానీ పవర్, అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ దక్కించుకున్నాయి. విద్యుత్ చట్టాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించారని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వాటికవే 50 శాతం ఉత్పత్తిని పెంచుకోవచ్చనే నిబంధనను వైకాపా ప్రభుత్వం జోడించటంతో ఏటా రూ.4050కోట్ల బిల్లింగ్ చొప్పున 30 ఏళ్లలో లక్షా 20 వేల కోట్లు దోచుకునే వెసులుబాటు కల్పించారు. లైసెన్స్‌లు లేని ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ కంపెనీకి వివాదాల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న సంస్థ మూడేళ్ల వరకూ 51శాతం వాటాని మళ్లించరాదనే నిబంధననూ ఏడాదికి కుదించారు. బినామీలుగా ఉన్న షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌లో ఉన్న వాటాలు తిరిగి జగన్ రెడ్డి నేరుగా తీసుకునే వెసులుబాటు దీని ద్వారా కల్పించారు. దేశంలో కనిష్టంగా 1.90 రూపాయలుగా ఉన్న యూనిట్ విద్యుత్ ధరను రూ.2.50కు ఖరారు చేశారు. 30 ఏళ్ల కాలపరిమితికి ఇది ఫిక్స్డ్ టారిఫ్ పెట్టడమూ మరో ఉల్లంఘన. ప్రతిపక్ష నేతగా సౌర, పవన విద్యుత్‌తో రాష్ట్రానికి పనిలేదన్న జగన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ తయారీకి ఎలా టెండర్లు పిలిచారు?- పట్టాభిరామ్
ఇదీ చదవండీ... AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!