నగర, పురపాలకల్లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, క్వారంటైన్ల నిర్వహణ, వలస కార్మికులకు ఆహార సరఫరా బాధ్యతలు అప్పగించడంతో రహదారుల మరమ్మతులు, కాలువల్లో పూడికల తొలగింపు పనులు ప్రారంభించలేదు. దీనివల్ల రహదారులపై మురుగునీరు చేరడం, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలతో నీటి ప్రవాహం ఎక్కడికక్కడే నిలిచిపోయి దోమల బెడద తీవ్రమై ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రహదారుల్లేకపోతే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అందరికీ తెలిసిందే.
- మూడు నగరాల్లో ఏటా సమస్యే..!
వర్షాకాలంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో ఏటా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పనులు సైతం పూర్తి కావడం లేదు. విశాఖలోని గంగుల గెడ్డ, ఎర్రిగెడ్డ, ఎస్‌ఎల్ కాలుల్లో పూడికలు పూర్తిగా తొలగించకపోవడంతో వర్షాకాలంలో నీరంతా బయటకు వస్తోంది. దీంతో జ్ఞానాపురం, కంచరపాలెంలోని అనేక ప్రాంతాలు వరద నీటి ముంపునకు గురవుతుంటాయి.
* విజయవాడలోని వన్‌టౌన్‌లోని వింజిపేట, ఇస్లాంపేట, కొత్తపేట, జెండాచెట్టు ప్రాంతాలు, మొగలరాజుపురం, సింగ్‌నగర్‌లోని అనేక ప్రాంతాలకు వరద నీటి ముంపు ఏటా తప్పడం లేదు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.461 కోట్లతో 444 కిలో మీటర్లలో మూడేళ్ల క్రితం చేపట్టిన వరదనీటి ప్రవాహ కాలువ నిర్మాణం 60 శాతమూ పూర్తి కాలేదు.
* గుంటూరులోని శివనగర్‌రాజు కాలనీ, ఏటిఅగ్రహారంలోని శివరాంకాలనీ, పొన్నూరు రోడ్డులోని చంద్రబాబునాయుడు కాలనీ, జాకీర్‌హుస్సేన్ నగర్‌తోపాటు గోరంట్లలో కొత్తగా వెలసిన అనేక కాలనీల్లోకి ఏటా వర్షం నీళ్లు చేరుతున్నాయి. రూ.903 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం ప్రారంభించిన భూగర్భ మురుగునీటి ప్రవాహ కాలువ (యూజీడీ) పనుల్లో ఇప్పటికి యాభై శాతమే పూర్తయ్యాయి.