నిన్న మొన్నటి వరకు బయటకు రావాలంటేనే భయం.. ఎక్కడ కరోనా సోకుతుందో అని ఒకటే బెరుకు. ఆరు నెలలు దాటింది.. జనంలో నెమ్మదిగా భయం తగ్గింది. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పనుల నిమిత్తం రోడ్ల మీదకు వస్తున్నారు. బస్సులు, ఆటోలు తిరుగుతున్నాయి. సినిమా హాళ్లు తప్ప దాదాపు అన్ని వ్యాపార కార్యకలాపాలూ మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు పనిచేస్తున్నాయి. విద్యాసంస్థలు తెరుస్తున్నారు. విమానాలు, రైళ్లు నిండుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో పక్కపక్కనే కూర్చునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
పుంజుకున్న వాహన విక్రయాలు
లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక వేగంగా పుంజుకున్న వాటిలో వాహనరంగం ఒకటి. గత సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగిన విక్రయాలతో దాదాపు సమానంగా, ఈ ఏడాదీ జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగాయి. సెప్టెంబరులో ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా పెరిగాయి. కరోనా భయంతో సొంత వాహనమే మేలన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడటమే దీనికి కారణం. ఒక్క విజయవాడలోనే సెప్టెంబరులో 25వ తేదీ వరకు సుమారు 5వేల ద్విచక్ర వాహనాలు, 1300కుపైగా చిన్న, పెద్ద కార్ల విక్రయాలు జరిగాయి. లాక్‌డౌన్‌లో పూర్తిగా పడిపోయిన పెట్రోలు, డీజిలు విక్రయాలు మళ్లీ పుంజుకున్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగిన విక్రయాలతో పోలిస్తే.. ప్రస్తుతం పెట్రోలు 90%, డీజిలు 70-75% విక్రయిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు గిరాకీ
కొవిడ్ వల్ల విద్యాసంస్థలన్నీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. దానివల్ల ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు గిరాకీ పెరిగింది. ఐపీఎల్ సీజన్ మొదలవడం, వచ్చే నెల నుంచి ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో టీవీల విక్రయాలూ పెరిగాయి. కరోనా భయంతో కొందరు పనిమనుషుల్ని మాన్పించి.. పనులు సొంతంగా చేసుకోవడంతో, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లకు డిమాండ్ పెరిగినట్టు సమాచారం.
మాల్స్‌లో పెరిగిన సందడి
విజయవాడ బందరు రోడ్డులోని ప్రముఖ షాపింగ్ మాల్‌కి.. కరోనాకు ముందు శని, ఆదివారాల్లో రోజుకు 45-50 వేలు, మిగతా రోజుల్లో... 12-15 వేల చొప్పున వినియోగదారులు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య శని, ఆదివారాల్లో 9-10 వేలు, మిగతా రోజుల్లో ఐదు వేలుగా ఉంటోంది.
ఆశలన్నీ పండుగలపైనే
వస్త్రాలు, ఆభరణాల దుకాణాల్లో కొవిడ్‌కి ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 40-50% వ్యాపారం జరుగుతోంది. వచ్చేనెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ఉండటం, వరుసగా పండుగలూ వస్తుండటంతో వ్యాపారం మళ్లీ గాడిన పడుతుందన్న ఆశతో వ్యాపారులున్నారు. వస్త్ర, నగలు, గృహోపకరణాలు, వాహన విక్రయ సంస్థలు, దుకాణాలు.. దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరస్‌కి బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
బయటకొచ్చి తింటున్నారు
కరోనాతో కుదేలైన ఆతిథ్య రంగం కోలుకుంటోంది. హోటళ్లలో 30-40% గదులు బుక్ అవుతున్నాయి. తక్కువ మంది అతిథులతో వివాహాలు, ఇతర వేడుకలు హోటళ్లలో నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్లు కూడా తెరుచుకున్నాయి. వాటిలో వ్యాపారం క్రమంగా పెరుగుతోంది.
పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ప్రారంభించింది. ఆగస్టులో 48% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో, సెప్టెంబరులో 52%కు చేరింది. ప్రైవేటు బస్సులూ తిరుగుతున్నాయి.
* రైళ్లు ప్రయాణికులతో నిండుగా వెళుతున్నాయి. విశాఖ నుంచి దిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ బోగీల్లో ఖాళీ ఉండటం లేదు. ఏసీ బోగీలు 80% ప్రయాణికులతో వెళుతున్నాయి. విశాఖ మీదుగా వెళ్లే గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ వంటి రైళ్లలోనూ బెర్తులు ముందే బుక్ అయిపోతున్నాయి. సంక్రాంతికి సంబంధించి హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చే రైళ్ల రిజర్వేషన్లన్నీ ఇప్పటికే అయిపోయాయి.
* రైలు ప్రయాణం సురక్షితం కాదనుకుని, కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు విమాన ప్రయాణాలపై మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముందు విశాఖకు రోజూ 76 విమానాలు వచ్చి వెళ్లేవి. ఇప్పుడు రోజూ 32 వరకు వచ్చి వెళ్తున్నాయి. ఆక్యుపెన్సీ రేట్ 60-80% ఉంటోంది.
దేవాలయాల్లో సందడి
తిరుమలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి కొవిడ్‌కు ముందు శుక్రవారం 20-30 వేల మంది, మిగతా రోజుల్లో 10-15 వేల మంది చొప్పున వచ్చేవారు. ప్రస్తుతం రోజూ 3-4 వేల మంది వస్తున్నారు. అన్నవరంలోనూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సుమారు వెయ్యి మంది వస్తున్నారు.
ఇవీ చూడండి...