రాష్ట్ర రెవెన్యూలోటు కాస్త ఆందోళనకరంగా ఉందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ అన్నారు. నీతిఆయోగ్ బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్, అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. రంగాల వారీగా రాష్ట్ర పరిస్థితులను అధికారులు వివరించారు. ఏపీలో బడ్జెట్‌యేతర ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తున్నాయని రాజీవ్‌కుమార్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్‌లో సగానికి పైగా మానవవనరుల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. మూడు నెలల్లోనే తన పనితీరును చూపారని ప్రశంసించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం జగన్ తనకు దిల్లీలోనే వివరించారని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో రాష్ట్రం ముందుండేలా తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
కేంద్ర సాయం తగ్గకుండా ఉండేలా చూడండి
రుణాల విషయంలో ఎఫ్ఆర్బీఎమ్ పరిమితులు ఉన్నందున రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ నీతిఆయోగ్‌ను కోరారు. నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆధిక రుసుములు వల్ల చాలామంది పేదలు పిల్లలను బడులకు పంపించలేకపోతున్నారని రాజీవ్‌కుమార్ దృష్టికి జగన్ తీసుకొచ్చారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. పిల్లల్ని బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకు ఏడాదికి 15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
విభజన నష్టాన్ని పూడ్చాలి
విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని, దాన్ని పూడ్చాలంటే నీతి ఆయోగ్‌తో పాటు 15వ ఆర్థిక సంఘం ఉదారంగా సాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కోరారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టీసీలో డీజీల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని, అమ్మఒడి పథకం తీసుకొస్తున్నామని, వీటన్నింటికి కేంద్ర సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.