అసలే వృద్ధాప్యం.. ఆపై ఎన్నో ఆరోగ్య సమస్యలు.. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్న ఎందరో అవస్థలు(RETIRED EMPLOYEES PROBLEMS) పడుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీనే జీతాలు, పింఛన్ అందేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గతంలో ఖజానా శాఖ ద్వారా పింఛన్ ఇచ్చేవారు. ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థకు అనుసంధానం చేయడంతో సమస్య తలెత్తింది.
మందులు కొనేదెలా?
సహజంగానే వృద్ధాప్యంలో అనేక జబ్బులు చుట్టుముడతాయి. విశ్రాంత అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లు, మానసిక సమస్యలతో పని చేశారు. ఇలాంటి వారికి రక్తపోటు(బీపీ), మధుమేహం, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు.. వంటి రోగాలు వెంటాడుతున్నాయి. ఈ తరహా పింఛన్‌దారులు రోజూ మందులు తినాల్సిందే. నెలకు సరిపడా మందులు ఒకేసారి కొనుగోలు చేస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీన సొమ్ము రాగానే మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సక్రమంగా పింఛన్ జమ చేయడం లేదు. ఒక్కోసారి 15వ తేదీ వచ్చినా అందని దుస్థితి. ఈనెల కూడా వారం ఆలస్యంగా జమ అయింది. హిందూపురం, ముదిగుబ్బ, కదిరి, రాయదుర్గం వంటి ఉప ఖజానా శాఖల పరిధిలో కొందరికే సొమ్ము ఖాతాలో పడింది. విశ్రాంత అధికారులు, ఉద్యోగులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
సాంకేతిక సమస్యతో ఆలస్యం..
ప్రతి నెలా పింఛను సకాలంలో వస్తోంది. ఒకటి రెండుసార్లు మాత్రమే సమస్య ఏర్పడింది. గతంలో ట్రెజరీల నుంచి బ్యాంకుల్లో జమ అయ్యేది. ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా చెల్లింపులు సాగుతున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం అవుతోంది. ఈ నెల అందరికీ జీతాలు పడ్డాయి. ఉప ఖజానా కార్యాలయాల నుంచి కూడా బిల్లులు సకాలంలో సమర్పిస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే దృష్టి సారిస్తాం.
సమాచారం ఇవ్వడం లేదు...
నా భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. నాకు నెలకు రూ.26 వేలు పింఛను వస్తోంది. ఆ సొమ్ముపై ఆధారపడి నేను, నా కొడుకు, కోడలు జీవనం సాగిస్తున్నాం. అవసరమయ్యే మందులు, ఇతరత్రా అవసరాలకు ఈ సొమ్మే ఆధారం. గతంలో ప్రతి నెల 1న పింఛను నా ఖాతాలో జమవుతూ, చరవాణికి సమాచారం కూడా వచ్చేది. ప్రస్తుతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. సమాచారం ఇవ్వడం లేదు.
సమయానికి అందక సమస్యలు..
కదిరి: ఆరోగ్యశాఖలో సీహెచ్‌వో పనిచేసి ఉద్యోగ విరమణ చేశా. ముదిమి వయసులో ప్రశాంతంగా గడవాల్సిన జీవితం. సమయానికి పింఛను అందక ఆర్థిక ఇబ్బందులను చవిచూడాల్సి వస్తోంది. ఈనెల పింఛను అందలేదు. ఇంటి అద్దె, విద్యుత్తు బిల్లు, రక్తపోటు, మధుమేహానికి నెలవారీ మందుల ఖర్చులు ఉన్నాయి. నా భార్య కిందపడి కాలు విరగడంతో వైద్య ఖర్చుల భారం ఉంది. అంగడి సరకులు, అవసరాలకు ముందే తీసుకున్న సొమ్మును అడుగుతుండటంతో ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
అవసరాలకు ఎవరిని అడగాలి...
మాది కడప జిల్లా. ఇరిగేషన్ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా విరమణ పొందాను. అయితే బంధువులు ఉండటంతో కదిరికి వచ్చి స్థిరపడ్డాం. పింఛను ఆధారంగా జీవనం సాగిస్తున్నాం. ఆర్నెళ్లుగా పింఛను సకాలంలో అందడం లేదు. నెలవారీ రూ.2 వేల వరకు మందులకు ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంటి అద్దె నుంచి ఇతర అవసరాలను డబ్బులు అవసరం. ఇప్పటికీ పింఛను సొమ్ము ఖాతాకు జమ కాలేదు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోలేం.
సీఎఫ్‌ఎంఎస్‌ను రద్దు చేయాలి...
తెదేపా హయాంలోనే సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో క్రమంగా ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందాయి. ప్రస్తుతం సరిగా రావడం లేదు. అసలు వస్తాయో.. లేదో అన్న భయం వెంటాడుతోంది. బ్యాంకు ఖాతాలో పడగానే మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సొమ్ము పడిందా లేదా చూసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 70, 80ఏళ్ల వృద్ధులు తిరగగలరా? ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా పింఛన్ సొమ్మును సీఎఫ్‌ఎంఎస్‌లో వేసుకుని.. ఇతర వాటికి వాడటం సరికాదు. సీఎఫ్‌ఎంఎస్‌ను సత్వరమే రద్దు చేయాలి. - పెద్దన్న గౌడ్, అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం
● మొత్తం పింఛన్‌దారులు : 27,000
● సర్వీసు పెన్షనర్లు : 13,210
● కుటుంబ పెన్షనర్లు : 9,425
● ప్రతి నెలా చెల్లింపు : రూ.74.40 కోట్లు
ఇదీ చూడండి: VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ