కరోనా దెబ్బకు పట్టణాల్లో అద్దె ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉపాధి కోల్పోయి చాలామంది స్వస్థలాలకు తరలిపోతున్నారు. పట్టణాల్లో కుటుంబ పోషణకు భరోసా ఉంటుందనే నమ్మకంతో తరలివచ్చిన కుటుంబాలు ఉపాధి కరవై సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లోని వీధుల్లో హడావుడి తగ్గుతోంది. అనేక ఇళ్లముందు ‘టు లెట్’ బోర్డులు వేలాడుతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ నగరాలకు వెళ్తారు.
ఈ ఐదు నగరాల్లో దాదాపు 5.50 లక్షల కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవే. వీరిలో 25-30% మంది శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటే, మిగతా 70% కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. వీళ్లలో చాలామందికి లాక్‌డౌన్ తర్వాత ఉపాధి లేక జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. వ్యాపారాలు సాగక సంస్థలు మూతపడుతున్నాయి. పరిశ్రమల్లో ఉపాధి అరకొరగానే లభిస్తోంది. ఒకటి, రెండు నెలలు సరిపెట్టుకున్న కుటుంబాలు చేసేది లేక అద్దె ఇళ్లు ఖాళీచేసి స్వస్థలాలకు వెళ్లిపోతున్నాయి. ఈనెల మొదటివారంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో 30 వేలకుపైగా ఇళ్లు ఖాళీ అయినట్లు వార్డు వాలంటీర్ల పరిశీలనలో వెల్లడైంది.
కూలీలపై తీవ్ర ప్రభావం
రోజుకూలీలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్వస్థలాలకు వెళ్లినవారిలో వీరే 70% వరకు ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో భవన నిర్మాణ రంగంలో అత్యధికులు ఉపాధి పొందుతున్నారు. దుకాణాల్లో పనిచేసేవారు, రోడ్లపై పళ్లు, పూలు విక్రయించేవారు సైతం ఇళ్లకు పరిమితమవుతున్నారు. మూడు నెలల్లో ప్రధాన నగరాల నుంచి 50 వేలకుపైగా కుటుంబాలు సొంతూళ్లకు వెళ్లినట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సిబ్బంది గుర్తించారు. వీరందరికీ కొత్తగా జాబ్‌కార్డులిచ్చి గ్రామాల్లో పనులు కల్పించారు.
కరోనాతో పనుల్లేక రెండు కుటుంబాలు ఇళ్లు ఖాళీచేసి మూడు నెలల క్రితం వెళ్లిపోయాయి. టులెట్ బోర్డులు పెట్టినా అద్దెకు ఇళ్లు కావాలని ఎవరూ అడగడం లేదు. కుటుంబానికి ఆసరాగా నిలిచే అద్దెలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం’ -షేక్ ఇక్బాల్, పటమట, విజయవాడ
మచిలీపట్నంలో పదేళ్లుగా టిఫిన్ షాపు నడిపేవాడ్ని. కరోనాతో షాపు మూతపడి ప్రత్యామ్నాయం లేక సొంతూరు వచ్చేశాను. కరోనాతో చాలా అవస్థలు పడుతున్నాం. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశించినా ఫలితం లేకపోయింది’ -వి.నాగరాజు, లావేరు, శ్రీకాకుళం