సంగం డెయిరీని హస్తగతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు చుక్కెదురైంది. సంగం డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని.. హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సమర్థించిన ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటీషన్‌ను తోసిపుచ్చింది.
గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం.. సంగం డెయిరీని..ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 27న సంగం డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ జీవో విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సమర్దించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్‌చేస్తూ ధర్మాసం ముందు ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అపీల్‌ను తిరస్కరించింది. సంగం డెయిరీ విషయంలో దాఖలైన ఇతర ఇంప్లీడ్ పిటిషన్లనూ తోసిపుచ్చింది.
సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. డెయిరీ నిర్వహణ బాధ్యతను పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం 2021 లో జీవో ఇచ్చిందని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ హోదా పొందాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అన్నారు. రాజకీయ కారణాలతో సంగం డెయిరీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని వాదించారు.
ప్రజాప్రయోజనాల దృష్ట్యానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఆ జీవోతో డెయిరీ కార్యకలాపాలకు ఎలాంటి అవరోధం లేదన్నారు. జీవోను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయంగా లేవన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేసి జీవో అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం కూడా అప్పీల్ వేసింది తాము వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని పిటిషినర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ..సంగం డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'