రాష్ట్రంలోని 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో.. వచ్చే నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సచివాలయ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందికి ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై శిక్షణ ఇస్తున్నారు. భూముల రీ-సర్వే జరిగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను నవంబరు 3వ వారంలో ప్రారంభించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలో సచివాలయాల్లోనూ ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం అమలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత విధానంలోని లోపాలు, అవకతవకలను పరిగణనలోనికి తీసుకుని.. ఎనీవేర్ విధానాన్ని ఇప్పటికంటే మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోని ఆనంద్‌నగర్, పటమట, ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం కింద ఎవరైనా, ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సహకారం..
ఆయా ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సీనియర్ ఉద్యోగి ఒకరు కొంతకాలం పాటు సచివాలయాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సచివాలయ కార్యదర్శి స్కాన్‌చేసి, వారి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లకు పంపితే.. వారు పరిశీలించి, అనుమతి ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకునే విధానాన్నీ పరిశీలిస్తున్నారు.
అయితే.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలును సచివాలయాల్లో ప్రారంభించాలా? వద్దా? అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లకు అవసరాలకు తగ్గట్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: