దేశంలో స్థిరాస్తిరంగం కరోనా ప్రభావం నుంచి బయటపడిందని ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎనిమిది ప్రధాన నగరాల్లో జరిగిన క్రయవిక్రయాలు, నిర్మాణ ప్రారంభాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 44శాతం, ప్రారంభాల్లో 38శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతాలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 76వేల 6 నిర్మాణాలు మొదలయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 38శాతం అధికమని అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్‌లో 211శాతం, ముంబయి 39, పుణె 43, అహ్మదాబాద్ 89, దిల్లీ 14, కోల్‌కతా 68శాతం ప్రారంభోత్సవాల్లో వృద్ధి నమోదైంది. బెంగళూరులో 17శాతం, చెన్నైలో 15శాతం తగ్గిందని నైట్‌ఫ్రాంక్ సంస్థ తెలిపింది.
పెరిగిన విక్రయాలు
ఎనిమిది ప్రధాన నగరాల్లో గడిచిన మూడు నెలల్లో 71వేల 963 యూనిట్ల అమ్మకాలను.. గతేడాది ఇదే సమయంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 44శాతం అధికం. అత్యధికంగా చెన్నైలో 6వేల 909 యూనిట్లు అమ్మకాలు జరిగి.. ముందు ఏడాది కంటే 81శాతం వృద్ధి నమోదు చేసింది. పుణెలో 13వేల 653 యూనిట్లు అమ్ముడుపోయి 75శాతం వృద్ధిని కనబరచింది. ముంబయిలో 49శాతం, అహ్మదాబాద్ 36, కోల్‌కతా 34 శాతం అమ్మకాలు జరిగి తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు 18శాతం, దిల్లీ 22, హైదరాబాద్ 24శాతం తక్కువ వృద్ధి సాధించాయి.
స్థిరాస్తి ధరలు పెరిగాయి..
కరోనా ప్రభావంతో 2020లో ధరల పెరుగుదల ఆశించిన మేరకు లేదు. కోల్‌కతా, పుణె, ముంబయి, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు స్థిరాస్తి ధరలు తగ్గాయి. దిల్లీ, హైదరాబాద్‌లో ఒకశాతం పెరిగాయి. 2020 మొదటి మూడు నెలల ధరలతో ఈ ఏడాది అదే సమయంలో ధరలను పరిశీలిస్తే... ముంబయిలో ఒక శాతం తగ్గగా కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, బెంగుళూరు, దిల్లీలో స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో అత్యధికంగా 8శాతం, హైదరాబాద్‌లో 5శాతం ఈ మొదటి మూడు నెలల్లో ధరలు పెరిగాయి.
కరోనా ప్రభావం
ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తుండంతో ఆ ప్రభావం స్థిరాస్తిరంగంపై పడుతోందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీలు భయాందోళనకు గురై పనులకు రాకపోవడం వల్ల నిర్మాణ రంగంపై తీవ్రప్రభావం పడనుందన్నారు. ముందస్తు చర్యలు తీసుకున్నా... నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
భూసర్వే పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఒక మండలం: మంత్రి ధర్మాన