Rare Heart Surgery : గుండెపోటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన 77 ఏళ్ల వృద్ధుడికి అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించి తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఒకే సమయంలో బృహద్ధమని కవాటం మార్చడంతోపాటు పేస్‌మేకర్‌నూ అమర్చారు. ఇంతపెద్ద వయసు వ్యక్తికి రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఏకకాలంలో చేయడం అరుదైన విషయమని ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రీధర్ కస్తూరి, డాక్టర్ శైలేందర్ చెప్పారు.
టీఏవీఐ ప్రక్రియ..
Rare Heart Surgery in Hyderabad : తీవ్ర ఆయాసానికి తోడు కళ్లు తిరిగి సృహ తప్పడంతో సదరు వ్యక్తిని కుటుంబ సభ్యులు గత ఏడాది డిసెంబరు 26న ఆసుపత్రిలో చేర్చించారన్నారు. రోగిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు బృహద్దమని మూసుకుపోవడంతోపాటు గుండె కొట్టుకునే వేగం తగ్గినట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ నిర్వహించి వాల్వు మార్పిడితోపాటు పేస్‌మేకర్ పెట్టడం అత్యవసమని తేల్చారు. వయస్సు ఎక్కువతోపాటు ఇతర అనుబంధ సమస్యలూ ఉండటంతో టీఏవీఐ(ట్రాన్స్‌కాథెటర్ ఏరోటిక్ వాల్వు ఇంప్లాంటేషన్) ప్రక్రియ చేపట్టామన్నారు.
ఇదే మొదటిసారి..
Heart Surgery to Old Man : దీనిలో భాగంగా రోగి తొడలోని రక్తనాళాల ద్వారా హృదయ కవాటం మార్చడం, అదే సమయంలో పేస్‌మేకర్‌నూ కూడా అమర్చినట్లు తెలిపారు. ఈ రెండు చాలా క్లిష్టమైన ప్రక్రియలని, వీటిని ఒకేసారి ఒకే రోగికి చేయడం ఇప్పటివరకు మనవద్ద జరగలేదన్నారు. ప్రస్తుతం ఆ రోగి కోలుకున్నాడని వారు వెల్లడించారు. వృద్ధాప్యం లేదా కొన్ని జబ్బుల కారణంగా గుండె విద్యుత్తు ప్రేరణ ఉత్పత్తిలో తేడాలు ఏర్పడినప్పుడు గుండె వేగం తగ్గి, త్వరగా అలసిపోవటం, తల తిరగడం, అప్పుడప్పుడు సృహ కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయన్నారు. దీనికి ప్రత్యేకంగా మందులు ఉండవని, గుండె వేగాన్ని పెంచడమే ఒక్కటే మార్గమని వారు వివరించారు.