Rapido Technology Centers in Telangana: ర్యాపిడో సహస్థాపకుడు గుంటుపల్లి పవన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుతో భేటీ అయింది. సమావేశంలో ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ 2015లో ప్రారంభమైన తమ సంస్థ దేశంలోని 100 నగరాల్లో ద్విచక్రవాహన టాక్సీలను నడుపుతోందని, 1500 ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 400 మంది చోదకులకు ఉపాధి కల్పించామని, మరో రెండేళ్లలో వెయ్యిమందికి పైగా ఉపాధి పొందుతారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు లక్ష రైడ్‌లు నడుస్తున్నాయన్నారు. కొత్తగా 600 మందికి పైగా విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి పొందేందుకు ర్యాపిడో శిక్షణ ఇస్తోందని తెలిపారు. యాప్ ఆధారిత సేవలను విస్తరించేందుకు వీలుగా కొత్తగా కృత్రిమ మేధ తదితర నవీన సాంకేతిక పరిజ్ఞానం వృద్ధికి సాంకేతిక కేంద్రాలను స్థాపించాలని నిర్ణయించామన్నారు. ఉబర్ మాదిరే ర్యాపిడో కూడా విస్తరించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సాంకేతిక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి లక్ష్యాల సాధనకు సహకరించాలని కేటీఆర్ ర్యాపిడో ప్రతినిధులను కోరారు.
ప్లగ్ అండ్ ప్లేకు కేటీఆర్ అభినందనలు
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేటు, ఆవిష్కరణల వేదిక అయిన ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ భారతదేశంలో తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. గత అక్టోబరు 29న తన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ప్లగ్ అండ్ ప్లే కేంద్రం ఏర్పాటును ప్రకటించిందన్నారు. ఆ ప్రకారం కేంద్రాన్ని ప్రారంభించడంపై ధన్యవాదాలు తెలిపారు. తమ భాగస్వామ్యంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలుంటాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్యారిస్‌లో ప్లగ్ అండ్ ప్లే వ్యవస్థాపక ముఖ్యకార్యనిర్వహణాధికారి సయీద్ అమీదితో సమావేశం, హైదరాబాద్‌లో ప్రారంభించిన కొత్త కేంద్రం ఫొటోలను ట్విటర్‌కు జత చేశారు.
ఇదీ చూడండి: జోరెత్తుతున్న మత్తు విక్రయాలు- ఎన్సీబీకి సిబ్బంది కరవు