ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు 20 కోట్ల రూపాయల భూరి విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల రూపాయల చొప్పున విరాళం అందించారు. కరోనా వల్ల దేశవ్యాప్తంగా జన జీవనం స్తంభించిపోయిన వేళ వార్తామాధ్యమాలుగా ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రజా చైతన్యం కోసం యథాశక్తి కృషి చేస్తున్నాయి. తెలుగు వారికి ఆర్థికంగానూ కొంత చేదోడుగా నిలిచేందుకుగాను ఈ డబ్బును ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పంపించారు. ముఖ్యమంత్రులను నేరుగా కలిసి ఇవ్వడానికి సంచార నిషేధం ఉన్న కారణంగా ఆన్‌లైన్‌లో విరాళం సొమ్మును బదిలీ చేశారు. కరోనాపై పోరులో ప్రజలు విజయం సాధించాలని, ఉభయ రాష్ట్రాలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రామోజీరావు ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.10 కోట్ల విరాళం అందజేసినందుకు రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందన్నారు. సంక్షోభ సమయంలో మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన రామోజీరావుకు లేఖ రాశారు.
ఇదీ చదవండి: నిజాముద్దీన్‌కు 2,100 మంది విదేశీయులు- వారి నుంచే కరోనా!