తెలుగుదేశం అధికారంలో ఉండగా అవసరం కోసం వచ్చిన నాయకులు.. ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపోయారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రామచంద్రాపురం నియోజకవర్గం వైకాపా నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
"తెలుగుదేశం పార్టీ సరైన పార్టీ అని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం సుస్వాగతం. మాజీ సర్పంచులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరటం శుభపరిణామం. పార్టీకి ఎప్పుడూ అండగా నిలబడుతూ, అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకు అభినందనలు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీకి మంచి నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి. పార్టీకి కష్టాలు కొత్త కాదు.. ఒకరు పోతే పార్టీకేమీ కాదు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుంది" అని చంద్రబాబు తెలిపారు.
తెదేపాలో చేరిన వారిలో మాజీ సర్పంచులు రాయుడు లీలాశంకర్, గుడిపుడి గోవిందరాజు, కోట తాతబ్బాయి, పొంపన శ్రీనివాస్, వీరబ్రహ్మం, పెంకె సూర్యనారాయణ, ఆలిపర్ రాంబాబు, పిల్లి సత్యనారాయణలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రమణ్యం, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, రెడ్డి అనంతకుమారి, గంటి హరీష్, వరపుల రాజా, తదితరులు పాల్గొన్నారు.