తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడాన్ని రాజ్యసభ అభినందించింది. అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో పర్యాటకులను ఆకర్షించే రామప్ప దేవాలయం దేశ సంస్కృతికి అద్దంపడుతుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొనియాడారు. 800 ఏళ్లుగా ఈ దేవాలయం కాకతీయుల కళా నైపుణ్యాన్ని చాటిచెబుతోందని ప్రశంశించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం దేశానికి గర్వ కారణమని వెంకయ్య తెలిపారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలోని చరిత్రాక కట్టడం రుద్రేశ్వర ఆలయం రామప్పగా పేరుతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కో గుర్తించింది. కాకతీయుల కాలంలో గొప్ప శిల్పసంపదకు నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం. దాదాపు 40 ఏళ్లపాటు ఈ కోవెలను నిర్మించారు. 800 ఏళ్లుగా ఈ దేవాలయం కాకతీయుల కళా నైపుణ్యాన్ని చాటిచెబుతోంది. అంతటి విశిష్టమైన ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం. -వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
తనివి తీరని దృశ్యకావ్యం..
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు.
ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి అపురూప గుర్తింపు లభించింది.
ఇదీ చదవండి: