PV Sindhu at Lal Darwaza bonalu : తెలంగాణలోని హైదరాబాద్ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మొదటి బోనాన్ని దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు సమర్పించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. అమ్మవారికి ఆమె బోనం సమర్పించింది. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత ఏడాది మాత్రం టోర్నమెంట్ కారణంగా రాలేకపోయింది. ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. సింధును ఆలయ కమిటీ సత్కరించింది.
"నాకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. కానీ గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయాను. ఈసారి అమ్మకు బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి తప్పకుండా ప్రతియేడు బోనాల ఉత్సవంలో పాల్గొంటాను." - పీవీ సింధు, భారత స్టార్ షట్లర్
మరోవైపు.. లాల్‌దర్వాజా అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూలో వేచి చూస్తున్నారు. మైనంపల్లి కుటుంబ సభ్యులు కూడా లాల్‌దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
- ఇదీ చదవండి : ఆహార భద్రత ప్రమాణాల్లో .. ఏపీ కి 17వ స్థానం