భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి51 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో పాటు, మనదేశానికి చెందిన ఐదు, అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వాహకనౌక బయలుదేరిన 17 నిమిషాల తర్వాత బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువు గల అమెజానియా-1 విడిపోయి నిర్ధారిత కక్ష్యలోకి చేరింది తర్వాత మరో 1.51 నిమిషాలకు మిగిలిన 18 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉపగ్రహంతో పాటు భగవద్గీతను అంతరిక్షంలోకి పంపడం ద్వారా విజయ‘గీత’ం అందుకుంది. వీటితోపాటు ప్రధాని మోదీ ఫొటో, 25వేల మంది పేర్లు ఉంచారు.
ఉపగ్రహాల ప్రయోజనాలు..
బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం అమెజానియా-1. ఇది అమెజాన్ ప్రాంతంలో అటవీ సంపదను పర్యవేక్షించడానికి, బ్రెజిలియన్ భూభాగం అంతటా వ్యవసాయ విశ్లేషణ కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను అందిస్తుంది.
* అమెరికా పంపిన 13లో ఒకటి సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం కాగా మరో రెండు ఉపగ్రహ సమాచార మార్పిడి, డేటా రిలే కోసం ఉన్నవి.
* భారతదేశానికి చెందిన ఐదు ఉపగ్రహాల్లో స్పేస్ కిడ్జ్ ఇండియా రూపకల్పన చేసిన సతీశ్ ధవన్ శాట్ రేడియేషన్ స్థాయి, అంతరిక్ష వాతావరణ అధ్యయనంతో పాటు సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీలకు ఉపయోగపడుతుంది. మూడు కళాశాల విద్యార్థులు రూపొందించిన మూడు ఉపగ్రహాల కలయిక యూనిటీ శాట్ రేడియో రిలే సేవలు అందిస్తుంది.
నౌకలపై నిఘా..
పీఎస్‌ఎల్‌వీ- సి51 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ‘సింధునేత్ర’ కూడా ఉంది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక, మర్చంట్ నేవీ నౌకల కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక, వాణిజ్య ప్రయోజనాలకు కీలకమని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త శకానికి నాంది: ఇస్రో అధిపతి డాక్టర్ శివన్
పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం ప్రత్యేకమైంది. దేశంలో అంతరిక్ష సంస్కరణల కొత్త శకానికి ఈ ప్రయోగం నాంది పలుకుతుంది. ఇకపై ప్రైవేటు వ్యక్తులు అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి దేశానికి సేవలందిస్తారు. అమెజానియా-1 ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు భారత్‌కు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఏడాది 14 ప్రయోగాలు చేపట్టనున్నాం. ఏడాది చివర్లో మొదటి మానవరహిత మిషన్ (గగన్‌యాన్) చేపడతాం.
మాకు ముఖ్యమైన ప్రయోగం: బ్రెజిల్ మంత్రి
బ్రెజిల్‌కు అమెజానియా-1 ఉపగ్రహ ప్రయోగం చాలా ముఖ్యమైందని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక మంత్రి మార్కోస్ క్వాంటస్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ-సి51 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రయోగానంతరం మాట్లాడారు. ఈ ప్రయోగం తమ భాగస్వామ్యానికి సానుకూల దశ అని పేర్కొన్నారు.
ప్రముఖుల అభినందనలు
పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ అంతరిక్ష సంస్కరణలలో ఇది కొత్తశకమని ప్రధాని అన్నారు.
ఇదీ చదవండి: