జై అమరావతి నినాదాలతో....రాజధాని గ్రామాలు ప్రతిధ్వనించాయి. ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, రైతులు చేపట్టిన నిరసనలు 301వ రోజుకు చేరాయి. ఆందోళనలకు వివధ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. రైతులు వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను చాటారు.రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో కాగడాల ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని రైతులు కాగడాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. తమ ఉద్యమంలో న్యాయం ఉందన్న రైతులు.....చివరికి తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.
అమరావతి ఉద్యమం లేకపోతే వేలాదిగా పోలీసులను ఎందుకు పెట్టారో.... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేత బొండా ఉమా డిమాండ్ చేశారు. విశాఖ భూములు కొల్లగొట్టేందుకే ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై కేసులున్నాయనే అక్కసుతోనే అమరావతి కోసం శాంతియుత ఉద్యమం చేస్తున్న మహిళల పై....ముఖ్యమంత్రి జగన్ అక్రమకేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని సమర్థించిన జగన్....ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో ప్రజలకు చెప్పాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ డిమాండ్ చేశారు. 300 రోజుల ఆందోళనలు చూసైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు. నిర్మించే వాడే నాయకుడవుతాడు కానీ.. కూల్చేవాడు నాయకుడు కాలేడని....ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని మహిళా నేత దివ్యవాణి సూచించారు.
ఎవరు చేస్తున్నది డ్రామానో ప్రజలు త్వరలో తేలుస్తారని....తెలుగుదేశం నేత జవహర్ విమర్శించారు. ఇప్పటికీ ఉద్యమమే లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కష్టాలు వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు ఉద్యమ వందనాలని.... సినీనటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. న్యాయమే గెలుస్తుందంటూ ట్విట్టర్ ద్వారా సంఘీభావం ప్రకటించారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ కృష్ణా జిల్లా నూజివీడు మండలం హన్మంతుల గూడెం నుంచి పెద్ద తిరుపతికి చేస్తున్న పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. అమరావతిని రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో.....స్థానికులు కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి