తెలంగాణలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు.
ఈ సమావేశంలో పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు.
వాటి ఆధారంగానే...
గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి: