ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ)’ సంస్థ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ‘అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్’ వ్యవస్థాపకులు డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్ పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ పురస్కారాన్ని స్వీకరించడం అంతర్జాతీయంగా అరుదైన గౌరవంగా జీర్ణకోశ వైద్యనిపుణులు భావిస్తుంటారు.
ఎండోస్కోపీలో ఆధునిక పరిశోధన, శిక్షణకు గుర్తింపు
ఎండోస్కోపీ విధానంలో అందిస్తున్న అధునాతన వైద్యసేవలు, సాంకేతిక పరిజ్ఞానం, దీర్ఘకాల పరిశోధన, సునిశిత బోధన, పటిష్ఠ శిక్షణ, అంతర్జాతీయ భాగస్వామ్యం, విశిష్ట నైపుణ్యం, మార్గదర్శకునిగా నిలిచినందుకు గుర్తింపుగా డాక్టర్ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఏఎస్‌జీఈ వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో ఎండోస్కోపీ చికిత్సలపై వందలాది ఉపన్యాసాలిచ్చారనీ, 700కి పైగా వైద్యపత్రాలను సమర్పించి, 50కి పైగా వైద్యపత్రికలను సమీక్షించిన ఘనత ఆయన సొంతమని పేర్కొంది. ఆయనకు ఈ అవార్డును అందజేయడం తమకు గర్వకారణంగా నిలుస్తోందని ఏఎస్‌జీఈ తెలిపింది.
అందుబాటులో నాణ్యమైన వైద్యమే లక్ష్యం
జీర్ణకోశ వైద్యనిపుణులకు ఈ అవార్డు పొందడం ఒక కల. ఈ పురస్కారాన్ని పొందడం గౌరవంగా భావిస్తున్నాను. ఏ రంగంలోనైనా అంకితభావంతో కష్టపడితే.. గుర్తింపు దానంతటదే లభిస్తుందనడానికి ఈ అవార్డు ఒక ఉదాహరణ. మా ఆవిడ కేరల్, ఇతర కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం లేకుండా ఇలాంటి విజయాలు సాధ్యమయ్యేవి కావు. నా సహచర వైద్యబృందం ప్రతి అడుగులో నాకు అండగా, మద్దతుగా నిలిచింది. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యం దిశగా నిరంతరం కృషిచేస్తూనే ఉంటాను.-డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్, ఏఐజీ
ఇదీ చదవండి: పల్లె పోరు: ముందు మేము..తరువాత మీరు..!