రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని... వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్‌కు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని, సొంతంగా 15 వేల వయల్స్ కొనుగోలు చేస్తున్నామని మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో సరఫరా ప్రారంభమవుతుందని వివరించారు. ఒక్కో బాధితునికి 60 వయల్స్ వరకు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారన్నారు. ఒక రోగికి రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్లాక్ ఫంగస్‌కు వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కింద చేర్చామని తెలిపారు.
ముందు జాగ్రత్తగా ఆలోచించి 3 కంపెనీల నుంచి 15 వేల వయల్స్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సింఘాల్ వివరించారు. బ్లాక్ ఫంగస్ బాధితుల వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బ్లాక్ ఫంగస్ చేర్చడంతో పాటు కరోనా కారణంగా తల్లిదండ్రులు మృతిచెందడం వల్ల అనాథలైన పిల్లల సంరక్షణకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీచేసిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి, జ్వరాల సర్వే, హోం ఐసోలేషన్ కిట్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు.
ఇపుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని, కరోనా రోగులకు సేవలు అందించేందుకు రాత్రిబంవళ్లు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని సింఘాల్ కొనియాడారు. రాష్ట్రానికి ఇచ్చే ఆక్సిజన్ కోటాను 625 మెట్రిక్ టన్నులకు పెంచినట్టు వివరించారు. ఆర్ఐఎన్ఎల్ నుంచి 170 మెట్రిక్ టన్నులు కేటాయించారన్నారు. ఇకపై 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని... ఆర్ఐఎన్ఎల్ నుంచి కోటా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం అంగూల్, రూర్కెల్లా ప్లాంట్ల నుంచి కేటాయింపులు పెంచిందని చెప్పారు. మరికొన్ని ట్యాంకర్లు కేటాయించాలని కోరగా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. ఈ నెల 23వ తేదీలోగా 4 ట్యాంకర్లు వస్తాయని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని సింఘాల్ తెలిపారు.
ఇదీ చదవండీ... గనుల శాఖ: కీలక నిర్ణయాలకు సీఎం జగన్ ఆమోదం