TDP MLAs letter to finance minister: ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు లేఖ రాశారు. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను సవివరంగా విన్నవించుకునేందుకు తగు సమయం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అత్యంత కరువు పీడిత జిల్లాగా ప్రకాశం ఉందని గుర్తు చేశారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాల్లో ప్రకాశం ఒకటని పేర్కొన్నారు. మూడేళ్లుగా వరుస కరవు పరిస్థితులు వెంటాడుతున్నాయని వివరించారు. రైతులు పంటలను పూర్తిగా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం కలగలేదని తెదేపా ఎమ్మెల్యేలు లేఖలో విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజిని పరిగణలోకి తీసుకుని ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్ళుగా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు తీసుకరాలేదని.., ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో చీకట్లు కమ్ముకున్నాయని మండిపడ్డారు. పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా గత 2 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని తమ జిల్లాకు చేయూత ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి
ఆయన డైరెక్షన్లోనే ఎంపీ జీవీఎల్.. హోదా అంశాన్ని తీసివేయించారు - పేర్ని నాని