POWER HOLIDAY: కొవిడ్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయి ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడుతున్న పరిశ్రమలకు ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించడం శరాఘాతంలా మారింది. విరామం లేకుండా పనిచేసే ప్రాసెసింగ్ పరిశ్రమలు విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించాలని, మిగతా పరిశ్రమలను రోజుకు 12 గంటల చొప్పున వారానికి ఐదు రోజులే నడపాలని ప్రభుత్వం నిర్దేశించడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయ్యింది. గత అయిదారు నెలల్లోనే ఉక్కు ధరలు టన్ను రూ.45 వేల నుంచి రూ.90 వేలకు పెరిగాయి. డీజిలు ధరలు అడ్డూ అదుపూ లేకుండా పరిగెడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మిగతా ముడిపదార్థాల ధరలకూ రెక్కలొచ్చాయి. వీటన్నింటితో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల్ని, ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ప్రభుత్వ నిర్ణయం కోలుకోలేని దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరెంటు కోతలతో ఉత్పత్తి 60-70 శాతం పడిపోతుందని, ఖాతాదారులకు గడువులోగా సరఫరా చేయకపోతే నమ్మకం కోల్పోతామని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా, ప్లాస్టిక్, ఫుడ్‌ప్రాసెసింగ్, రబ్బర్ రోలింగ్, సిమెంట్, ఫెర్రోఅల్లాయ్స్, స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వంటి పరిశ్రమల్ని నిరంతరం నడపాల్సి ఉంటుంది. కరెంటు కోతలు ఎక్కువ రోజులు కొనసాగితే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేమని, లక్షల మంది రోడ్డున పడతారని పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఒక్క సెకను ఆటంకం ఏర్పడినా ఇబ్బందేనని, మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే కనీసం నాలుగు గంటలు పడుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ధ్వజమెత్తుతున్నారు.
జనరేటర్‌పై నడిపితే ఐదారు రెట్లు భారం
కరెంటు లేని సమయంలో, జనరేటర్‌పైనయినా పరిశ్రమలు నడపలేని పరిస్థితిలో వాటి యాజమాన్యాలున్నాయి. డీజిల్ ధర చుక్కలనంటుతున్న వేళ.. జనరేటర్‌తో పరిశ్రమ నడిపితే ఉత్పాదక వ్యయం అయిదారు రెట్లు పెరగనుంది. చాలా పరిశ్రమల దగ్గర జనరేటర్లే లేవు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రోజులకే ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారడం, కరెంటు కోతలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం పరిశ్రమలకు రాలేదు. చిన్న పరిశ్రమకైనా 100 కేవీఏ సామర్థ్యం కలిగిన జనరేటర్ ఉండాలి. దానికి కనీసం రూ.7-8 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ రూ.7.50 నుంచి రూ.8కి వస్తోంది. జనరేటర్‌పై నడిపితే యూనిట్‌కు రూ.30-40 వరకు ఖర్చవుతుందని అంచనా. పైగా జనరేటర్లపై మెషీన్లు నడిపితే ఉత్పత్తి 70 శాతానికి తగ్గిపోతుందని చెబుతున్నారు.
కార్మికులు రోడ్డున పడతారు
కరెంటు కోతలతో పరిశ్రమలకు గడ్డుకాలమే. ఉక్కు ధరలు పెరిగి మా ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. కరెంటు కోతలతో రోజుకు ఒక షిఫ్ట్ మాత్రమే పని చేస్తే ఉత్పత్తి పడిపోతుంది. మిగతా కార్మికులకు కూర్చోబెట్టి జీతాలివ్వాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల మొన్నటి వరకు నిర్మాణరంగ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిశ్రమల్లో కార్మికులు రోడ్డున పడతారు. - వినోద్, ఛైర్మన్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా), విజయవాడ
లంచాలిచ్చినా కూడా స్థిరఛార్జీలు తిరిగిరాలేదు
కొవిడ్ సమయంలో పరిశ్రమలు కట్టిన ఫిక్స్‌డ్ ఛార్జీలను వెనక్కు ఇస్తాం.. దరఖాస్తు చేసుకోమని సీఎం చెప్పారు. మేం దరఖాస్తు చేసుకోగానే పరిశ్రమలశాఖలోని కొందరు అధికారులు మీకు ఫిక్స్‌డ్ ఛార్జీలు తిరిగి వస్తున్నాయి కాబట్టి దానిలో 10 శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి లంచాలిచ్చినా.. స్థిరఛార్జీలు తిరిగి రాలేదు. ఇప్పుడు కరెంటు కోతల దెబ్బ. పరిశ్రమల యజమానులెవరూ సంతృప్తిగా లేరు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెలు అమ్ముకుని నడుపుతున్నవారు ఉన్నారు. పరిశ్రమల్ని నడపవద్దంటే మూసేయడానికి మేం సిద్ధమే. మూసేస్తే ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం.- మురళీకృష్ణ, ఫ్యాప్సీ అధ్యక్షుడు
60 శాతం వరకు నష్టం
కరెంటు కోతలతో అన్ని పరిశ్రమలకు తీవ్ర సమస్యలు తప్పవు. జనరల్ షిఫ్ట్ ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు ఉంటుంది. ఉద్యోగుల్ని ఉదయం ఆరింటికే రమ్మంటే రారు. కరెంటు కోతలతో నేరుగా 60 శాతం నష్టం వస్తుంది. 2010-12 మధ్య ఇలాగే తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పదేళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి వచ్చింది. ఉద్యోగుల్ని ఉంచలేం. తీసేయలేం. నిర్మాణరంగం, ఫుడ్‌ప్రాసెసింగ్ వంటి వ్యాపారాలకు ఇది మంచి సీజన్. ఇప్పుడు కోతలతో వారి వ్యాపారాలు దెబ్బతింటాయి. - ఎ.కృష్ణబాలాజీ, విశాఖ ఆటోనగర్ చిన్నతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు
నడిపితే నష్టం.. నడపకపోతే కష్టం
విద్యుత్తు కొరత ప్రకృతి విపత్తులా వచ్చిందని, మూడు వారాల తర్వాత పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంటున్నారు. మూడు వారాల తర్వాత డిమాండ్ మరింత పెరుగుతుందే తప్ప ఎలా తగ్గుతుంది? విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే ఈ దుస్థితికి కారణం. 50 శాతం సామర్థ్యంతో పరిశ్రమల్ని నడుపుతూ సిబ్బందికి జీతాలు, బ్యాంకు వడ్డీలు చెల్లించడం కష్టం. వినియోగదారులకు చెప్పిన సమయానికి సరఫరా చేయకపోతే నమ్మకం కోల్పోతాం. అలాగని అధిక ఖర్చులు భరించి, పరిశ్రమలు నడిపితే నష్టాల్లో కూరుకుపోతాం. - రాజశేఖర్, సీఐఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి: POWER HOLIDAY: "పవర్ హాలీడే"లతో పరిశ్రమలు బెంబేలు.. ఆందోళనలో కార్మికులు