Extend Holidays for Educational Institutes: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం కనిపిస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా..17న విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించనున్నారని సమాచారం.
సెలవులను పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని 9న ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు.. ఇటు ఆన్‌లైన్ పాఠాలు లేవన్న విమర్శ వస్తుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి. అయితే సెలవులను పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటారన్న అభిప్రాయాన్ని కొందరు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:
TS Cm Kcr on BJP: భాజపా ముక్త్ భారత్.. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిదే