అమరావతిలో ఇన్నాళ్లూ రైతులు, మహిళలతో కాస్త అతిగా ప్రవర్తించిన పోలీసులు.. ఇప్పుడు రూటు మార్చారు. హైకోర్టు ఆగ్రహించిన తీరు, విచారణకు ఆదేశించిన వైనంతో.. కాస్త మెత్తబడ్డారు. నిన్న రాత్రి కొందరు పోలీసు అధికారులు అమరావతి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమను 144 సెక్షన్ పేరుతో ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి ఆంక్షలు విధించడంలేదని కాగితాలపై రాసుకొచ్చి.. సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. వారి విజ్ఞప్తిని రైతులు తోసిపుచ్చారు. ‘మీరు రాసుకొచ్చిన నివేదికలపై సంతకాలు పెట్టం. 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించండి. అప్పటి వరకు ఎలాంటి సంతకాలు చేసేది లేదు’’ అని రాజధాని గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. హైకోర్టు ఆదేశాలతోనే తాము విచారణకు వచ్చామని, మీ అభిప్రాయాన్ని కాగితంపై రాసి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయినా.. రైతులు స్పందించని కారణంగా.. పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.
ఇదీ కారణం...
రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు ఇటీవల తీవ్రంగా పరిగణించింది. 144 సెక్షన్ విధించడాన్ని ఆక్షేపించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈనాడులో ప్రచురితమైన కథనాలు, ఫొటోలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించి ప్రజాహిత వ్యాజ్యం మలిచింది. పలు ఇతర వ్యాజ్యాలతో కలిపి సోమవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల్ని పరిరక్షించే దిశగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్ 46 నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన పోలీసు అధికారులపై విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినా.. వారికి భంగపాటు ఎదురైంది.