తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పవన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బామ్మార్ది చనిపోతే పరామర్శించడానికి వచ్చిన బావను.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వాంతపూర్ శివారులో ఉన్న మంజునాథ ఆలయ ఆశ్రమ గదిలో బంధించి పెట్రోలు పోసి కుటుంబసభ్యులే సజీవదహనం చేశారు. ఈ ఘటన సంచలనం కల్గించగా... హత్యపై అతని భార్యపైనే కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులో మంజునాథ ఆలయ ఆశ్రమంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు రాచర్ల పవన్‌కుమార్‌ను సమీప బంధువులే సోమవారం రాత్రి సజీవ దహనం చేయడం సంచలనం రేపింది. జగిత్యాలకు చెందిన విజయ్ అనే వ్యక్తి కొండగట్టుకు సమీపంలో మంజునాథ ఆలయం పక్కనే కుటీరాన్ని నిర్మించుకున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్‌కుమార్, భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంజునాథ ఆలయానికి చేరుకున్నారు.
దర్యాప్తు ముమ్మరం
పవన్‌కుమార్ చేతబడి చేయించి తన భర్తను చంపించాడనే అనుమానంతో అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత ఆయన్ని కుటీరంలోని ఓ గదిలో బంధించింది. ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. మంటల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పవన్ కాలిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆస్తి తగదాలే కారణామా?
పవన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అత్తింటివారితో తన కుటుంబీకులకు తగదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అతని భార్యనే పక్కా ప్లాన్‌తోనే హత్య చేసి... ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న విజయ్‌తో పాటు, హత్యకు పాల్పడ్డ సుమలత, భార్య కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఆస్తి తగదాలు కూడా ఉండి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆస్తి కాజేసేందుకే తన కొడుకును హత్యచేశాడని పవన్ తల్లి ఆరోపించింది. పవన్ కుటంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
సంబంధిత కథనాలు