విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతపాలేనికి చెందిన లాలం సంతోష్‌ను ఎలమంచిలి వైకాపా ఎమ్మెల్యే కన్నబాబురాజు ఫోన్‌లో బెదిరించారనే ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాలం సంతోష్ మామ పదోవ వార్డుకు వైకాపా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. ఉపసంహరించుకోమని తన మామకు చెప్పాలంటూ బెదిరించారని ఆరోపించారు. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించినట్లు జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మామయ్య రుత్తుల శ్రీనివాస్ ఇంటిని కూలుస్తానని బెదిరించారని అందుకోసం రెవెన్యూ అధికారులు మంగళవారం ఇంటి వద్దకు చేరుకున్నారని చెప్పారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారన్న స్థానికుల అభ్యంతరంతో అధికారులు వెనుదిరిగినట్లు బాధితుడు తెలిపారు. అనంతరం మళ్లీ అర్థరాత్రి కూల్చేందుకు వచ్చారని చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు చెబుతున్న ఆడియోను కూడా పోలీసులకు అందజేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన కన్నబాబురాజు.. ఫోన్‌లో మాట్లాడింది తాను కాదని అన్నారు. తనలా ఎవరితోనో మాట్లాడించారని ఆరోపించారు. పైగా వార్డు సభ్యుడి ఎన్నిక కోసం తాను ఫోన్ చేయాలా అని ప్రశ్నించారు. ఇదంతా తెలుగుదేశం, జనసేన నాయకుల కుట్రగా అభివర్ణించిన ఆయన.. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. మరోవైపు కన్నబాబు రాజును తక్షణం అరెస్టు చేయాలని తెదేపా సీనియర్ నేత పప్పల చలపతిరావు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి