పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో కారణాలు ఎందుకు చెప్పలేదని ఏపీ జెన్కోను హైకోర్టు ప్రశ్నించింది. హీహెచ్ ఈపీ ఒప్పందం రద్దుపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు సింగిల్ జడ్జి ఎత్తివేయటాన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ జెన్కో ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసిందని నవయుగ తరఫు న్యాయవాది పి విల్సన్ వాదనలు వినిపించారు. సంజాయిషీ నోటీసు గానీ, రద్దుకు గల కారణాలు గానీ పేర్కొన లేదని అన్నారు. పీహెచ్ ఈపీ పనులు పూర్తి చేసేందుకు తమకు సమయం ఉన్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదనీ, ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మెుత్తం 27 నోటీసులిచ్చినట్లు హైకోర్టుకు తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే సొమ్ముతో పాటు ఆ నష్టాన్ని పూడ్చలేమని ప్రతి వాదనలు వినిపించారు. అందువల్లే సింగిల్ జడ్జి స్టే ఎత్తివేయగానే రీటెండరింగ్ ప్రక్రియతో ముందుకు వెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వ అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువకే ఓ సంస్థ బిడ్ దాఖలు చేసిందనీ, ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు ఆదా అయినట్లు తెలిపారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.