Peanut cultivation: తెలంగాణలోని నల్గొండ జిల్లా నల్లమలను ఆనుకుని ఉన్న దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, మల్లేపల్లి, పీఏపల్లి మండలాల్లోని ప్రాంతాలను కృష్ణపట్టిగా పిలుస్తుంటారు. పక్కనే కృష్ణమ్మ ప్రవాహం.. కూతవేటు దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా.. క్షామంతో కమ్ముకున్న ఈ ప్రాంతాలు కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాడుతుండేవి. పీడిస్తున్న కరవుతో పొట్టచేతబట్టుకుని ఉపాధి కోసం వలసలు వెళ్తుండేవారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది. కరవుతో అల్లాడిన ఊళ్లు.. పచ్చదనంతో వికసిస్తున్నాయి. బీడువారిన నేలల్లో.. కాసుల పంట పండుతుండుతోంది. దీంతో.. రైతులు పులకరించిపోతున్నారు.
సంప్రదాయ పంటలకు బదులుగా..
కృష్ణపట్టిలో కరవుతో వలస వెళ్లిన వారంతా రెండేళ్ల క్రితం లాక్‌డౌన్‌తో ఊళ్లబాట పట్టారు. కరోనా పరిస్థితులు, తమ ప్రాంతంలో పెరిగిన భూగర్భజలాలతో వ్యవసాయంపై పుట్టిన ఆశలతో హలం పట్టి పొలం దున్నటం ప్రారంభించారు. ఈ సారి వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వేరుశెనగ పంటపై దృష్టి సారించారు. ఎగువన ఉన్న డిండితో పాటూ తలాపునే ఉన్న సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపిస్తుండటంతో... భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులు బోరు బావులు తవ్వి.. నీటిని వృథా చేయకుండా స్ప్రింకర్లను బిగించి వాటి ద్వారా వేరుశనగ సాగు చేస్తున్నారు.
రెట్టింపయిన వేరుశనగ సాగు..
నల్లమలను ఆనుకొని ఉన్న దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, మల్లేపల్లి, పీఏ పల్లి మండలాల్లోని దాదాపు 60 గ్రామాల రైతులు ఈ యాసంగిలో దాదాపు 65 వేల ఎకరాల్లో వేరుశనగను సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో వరి పంటను కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం కోరుతుండటంతో... ఇక్కడి రైతులు సంప్రదాయ పంటలను కాకుండా లాభాలు వచ్చే వంగడాలను నమ్ముకుంటున్నారు. గతేడాది యాసంగిలో దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం రెట్టింపయింది. మేలైన వంగడాలు, అత్యాధునిక పద్ధతులతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరానికి గరిష్ఠంగా 16 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా వరి పండించిన జిల్లాగా ఉన్న ఉమ్మడి నల్గొండలో రైతులు తమ ఉత్పత్తులు విక్రయించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ పంటలు కాకుండా విభిన్నంగా వేరుశెనగ వైపు రైతులు అడుగులు వేయటం... మంచి లాభాలు పొందుతున్నారు. మరిన్ని అత్యాధునిక పద్ధతులతో పాటు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే.... మరిన్ని దిగుబడులు సాధిస్తామని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: