విద్యుత్ రంగంలో ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలపై భారాన్ని మోపుతోందని ఏపీ పీఏసీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ రంగంలో తప్పులు జరిగాయని ఆక్షేపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలను మూసేసి బయట నుంచి కొనుగోలు చేయడం వల్లే ఈ భారం పడిందన్నారు. ఒకే రాష్ట్రంలో మూడు రకాల విద్యుత్ బిల్లులేంటని.. ప్రాంతానికో ధర ఉంటుందా? అని నిలదీశారు.
ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజల నుంచి వసూలు చేయాలని చూస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రజలు వడ్డీలు కట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా.. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌ఎసీ) ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన నిలదీశారు. ప్రజలకు న్యాయం చేయకపోతే వారి పక్షాన తెదేపా పోరాడుతుందన్నారు.
ఇదీ చదవండి: dhulipalla : తెదేపా నేత ధూళిపాళ్లకు పోలీసుల నోటీసులు