![pawan kalyana welcoming cm jagan decision on kurnool rape case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6126093_pawan-1.jpg)
కర్నూలు జిల్లాకు చెందిన బాలిక అత్యాచారం, హత్య ఘటనను సీబీఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబానికి ఊరట కలిగిస్తుందని ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఈ కేసులో న్యాయం జరగటంలో ఆలస్యమైందన్న పవన్...సీబీఐ విచారణ ద్వారా త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో తాను ర్యాలీ నిర్వహిస్తే లక్షమంది ప్రజలు వచ్చి మద్దతు పలికారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా చేశారంటూ... బాధిత కుటుంబానికి అండగా నిలిచిన జన సైనికులకు, ప్రజాసంఘాలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
రేపు దిల్లీకి పవన్..
![pawan kalyana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6126093_pawan-2.jpg)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి తాను గతంలో ప్రకటించిన కోటి రూపాయల నిధిని కేంద్రీయ సైనిక్ బోర్డు ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులోనూ పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని జనసేన వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు.... మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియాతో పవన్ వేదిక పంచుకోనున్నట్టు చెప్పాయి.
ఇదీ చదవండి: