రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని.. సీఎం సొంతంగా తీసుకున్న నిర్ణయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలో భూకుంభకోణాలు జరిగితే విచారణ జరపాలి.. కానీ రాజధానులను మారుస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానిని మారిస్తే.. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందన్నారు. ఇకపై భూసేకరణ చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని నిలదీశారు. రాజధాని విషయంలో తొలి నుంచి జనసేనది ఒకే విధానమని పవన్ స్పష్టం చేశారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
రాజధాని తరలింపు ప్రభుత్వ నిర్ణయం కాదని.. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే అని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధానిలో భూ కుంభకోణాలు జరిగాయని వైకాపా చెబుతోందని.. కుంభకోణాలు చేసినవారిని విచారించి శిక్షించాలి కదా అని ప్రశ్నించారు. రైతులు నష్టపోకూడదని మొదట్నుంచీ పవన్ చెబుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇదీ చదవండి: అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?