కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని తాళ్లపొద్దుటూరుతో పాటు ఇతర గ్రామాల ప్రజల్ని... గండికోట రిజర్వాయర్ ఫేజ్ -2 పనుల కోసం బలవంతంగా తరలిస్తున్నారు. బాధితులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. భూసేకరణ చట్టం- 2013 సక్రమంగా అమలు చేయకుండా.. సరైన పునరావాస చర్యలు చేపట్టకుండానే నిర్వాసితులకు నోటీసులిచ్చి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి సహాయ పునరావాస కార్యక్రమాలు లేకుండా ఇళ్లు ఎలా ఖాళీ చేయాలని వైకాపా నాయకులే ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాళ్లపొద్దుటూరు గ్రామంతోపాటు 16 గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామన్నారు. అక్కడి పరిస్థితిని పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, కడప జిల్లా నాయకులు సుంకర శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. భూసేకరణ చట్టం అమలు చేసి, పునరావాసం ఇవ్వాలని.. అవి అమలు చేయడం లేదనే విషయాన్ని సంబంధిత కేంద్ర సంస్థల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి.. అండగా ఉంటామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇదీ చదవండి: