చేనేత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. లాక్డౌన్ వల్ల నేతన్నకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందారు.
రాష్ట్రంలో చేనేత వృత్తిపై 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పవన్ చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన నేతన్న నేస్తం పథకంతో 83 వేల మందికే ఆర్థిక సాయం అందిందని వివరించారు. ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయం అందించాలన్నారు.
లాక్డౌన్ అనంతరం చేనేత కార్మికుల జీవనోపాధికి అవసరమైన మార్గాలను ప్రభుత్వమే చూపించాలని కోరారు. నేతన్న నేస్తం పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయకూడదని కోరారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారందరికీ పథకాలు అమలు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: