మొన్న పిఠాపురం.. నిన్న బిట్రగుంట.. ఇవాళ అంతర్వేది.. ఇలా వరుసగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అవాంచనీయ సంఘటనలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవి యాధృచ్చికంగా జరుగుతున్నట్లు లేవని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముందే సరిగ్గా స్పందించి ఉంటే ఇలా జరిగేవి కాదన్నారు.
పిల్లలు కూడా నవ్వుతారు
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం చెబుతున్న సమాధానం చూస్తే పిల్లలు కూడా నవ్వుతారని ఆయన ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేని వారి పని, తేనెపట్టు కోసం చేశారంటూ.. ప్రభుత్వం "కథలు" చెబుతోందన్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా?అని ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని కోరారు.
మీ దర్యాప్తుపై నమ్మకం లేదు
జరిగిన ఘటనలను అన్ని మతాల పెద్దలూ ఖండించాలని పవన్ కల్యాణ్ కోరారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు... హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే సిబిఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామన్నారు. ఉగ్రవాద కోణం ఉంటే ఎన్ఐఏ దృష్టి సారించాలన్నారు.
హిందూమతం అంటే చిన్నచూపా..?
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించిన వివాదం, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం, ఇప్పుడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఇవన్నీ కచ్చితంగా చర్చించాలన్నారు. ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే. ఏ ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా.. ధైర్యంగా మాట్లాడతారు.. కానీ హిందువుల విషయానికి వచ్చేసరికే మతవాదులు అని ముద్ర వేస్తున్నారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంతమందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: