తెలంగాణ నూతన ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ బాధ్యతను అప్పగించిన గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్కు పార్థసారథి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో కమిషన్ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యం..
వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీన ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఎన్నికల నిర్వహణే తన ప్రాధాన్యమని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
మార్చిలో గ్రేటర్ వరంగల్...
వచ్చే ఏడాది 2021 మార్చితో పదవీకాలం ముగియనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఏప్రిల్లో సిద్దిపేట పురపాలక సంఘానికి సైతం ఎన్నికలు పెట్టాలని పార్థసారథి తెలిపారు.
కేంద్రం మార్గదర్శకాల అధ్యయనం..
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అధ్యయనం చేస్తామని పార్థసారథి స్పష్టం చేశారు. అనంతరం మిగిలిన పంచాయతీరాజ్, పురపాలికల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని వివరించారు.