‘కరోనా లాక్‌డౌన్ మా కళ్లు తెరిపించింది’... అంటుంది కల్పన. ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా, తమ చిన్ని కుటుంబాన్ని తలకిందులు కాకుండా నిలబెట్టిందనీ అదే రాకపోతే ఒక్కగానొక్క బిడ్డ తమకు దక్కేవాడు కాదనీ చెబుతూ కన్నీళ్ల పర్యంతం అవుతోంది.
కల్పన, రాజారావులిద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలు. కొడుకుని బాగా చదివించాలని మంచి పాఠశాలలో చేర్పించారు. పొద్దున్నే ఎనిమిదికల్లా పిల్లాడు స్కూలు బస్సు ఎక్కేసేవాడు. ఆ తర్వాత అరగంటకి భార్యాభర్తలు ఆఫీసులకు వెళ్లిపోయేవారు. సాయంత్రం వాళ్లొచ్చేసరికి ఆరో ఏడో అయ్యేది. వాళ్లకన్నా ముందే వచ్చిన పిల్లాడు తల్లి టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని మళ్లీ ఇంటికి తాళమేసి ట్యూషన్‌కి వెళ్లిపోయేవాడు. తొమ్మిదింటివరకూ అక్కడే చదువుకుని వచ్చేవాడు. ముగ్గురూ కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకునేవారు. ఇలా సాఫీగా రోజులు సాగిపోతున్న వేళ. లాక్‌డౌన్‌తో స్కూలు, ఆఫీసులు మూతబడ్డాయి. రాజారావు ఇంటినుంచి పనిచేసేవాడు కానీ కల్పనకు ఆ అవకాశం లేక ఖాళీగా ఉండేది. దాంతో కొడుకు మీద ధ్యాస పెరిగింది.
పిల్లాడు కొంతకాలంగా సరిగా మాట్లాడడం లేదని గుర్తొచ్చింది. టీనేజీలోకి వచ్చాడు కాబట్టి కాస్త మాటలు తగ్గాయనుకుంది. ఎనిమిదో తరగతి కదా, చదువు ఎక్కువై అలసిపోతున్నాడనుకుంది. ఇప్పుడు పరిశీలనగా చూస్తే పిల్లాడిలో చాలా మార్పు కన్పించింది. ఇంట్లో ఉంటే ఎప్పుడూ తన వెనకాలే ఉండి గలగలా కబుర్లు చెప్పేవాడల్లా ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ మాటే భర్తతో అంటే- పెద్దవాడవుతున్నాడు, ఇంకా నీ కొంగు పట్టుకు తిరగమంటే ఎట్లా అని కొట్టిపడేశాడు. మరోపక్క పిల్లాడేమో తనకి ఇష్టమైనవి వండినా సరిగ్గా తినేవాడు కాదు, తలుపేసుకుని గదిలో పడుకునేవాడు. మాట్లాడిస్తే విసుక్కునేవాడు. పిల్లాడి ప్రవర్తన చాలా తేడాగా అనిపించి భార్యాభర్తలిద్దరికీ మొదట ఏం చేయాలో పాలుపోలేదు. ట్యూషన్ టీచరుతో మాట్లాడితే ఎందుకైనా మంచిది ఒకసారి సైకియాట్రిస్టుకు చూపించమని తనకు తెలిసిన డాక్టరు నంబర్ ఇచ్చాడు. లాక్‌డౌన్ కాబట్టి వీడియో కౌన్సెలింగ్‌కి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కల్పన చెప్పినదంతా విన్న ఆయన డ్రగ్స్ అలవాటుందేమోనని అనుమానించారు. వీడియో కాల్‌లో పిల్లాడిని చూశాక నిజమేనని నిర్ధారించారు. అది విన్న కల్పనకి గుండె ఆగినంత పనయ్యింది. తన కలలపంట... రేపో మాపో ఇంజినీరై అమెరికా వెళ్లాల్సిన బంగారు తండ్రి... డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడా... కల్పన వణికిపోయింది.
డాక్టర్ ఫోనులోనే కల్పనను సముదాయించారు. కొడుకుని మళ్లీ మామూలు మనిషిని చేయాలంటే ముందు తల్లిదండ్రులేం చేయాలో వివరంగా చెప్పారు. బుజ్జగించి అడిగితే- స్కూల్ దగ్గర ఫ్రెండ్స్‌తో కలిసి కొన్ని నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నాననీ, లాక్‌డౌన్ వల్ల స్నేహితులను కలవడం వీలుకాక ఇబ్బందిపడుతున్నాననీ చెప్పాడు పిల్లాడు. మూడు నెలలపాటు డాక్టర్ కౌన్సెలింగ్‌తోనూ మందుల సాయంతోనూ మొత్తానికి గండం గడిచింది. లాక్‌డౌన్ రాకపోయుంటే... కల్పనకి కొడుకు పరిస్థితి ఎప్పుడు తెలిసేది..?
ఇది ఒక్క కల్పన కథ కాదు... ఎందరో తల్లిదండ్రుల కథ అంటున్నారు మానసికవైద్య నిపుణులు. లాక్‌డౌన్ సమయంలో డ్రగ్స్ అందకపోవడంతో ఒక్కసారిగా చాలా కేసులు బయటపడ్డాయనీ పిల్లలకీ వారి తల్లిదండ్రులకీ(parents be alert about drugs in hyderabad) కౌన్సెలింగ్ ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా గడిపామనీ చెప్పారు హైదరాబాద్‌లోని ఒక పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్. హైదరాబాద్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలన్నిట్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉందంటారు ఆయన. డీ అడిక్షన్ సెంటర్లు ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. వాటికి ఆల్కహాల్ డీ అడిక్షన్ కోసం వచ్చేవారికన్నా డ్రగ్ అడిక్షన్‌తో వచ్చే పేషెంట్లు ఎక్కువగా ఉంటున్నారు. పైగా వారిలో 12 నుంచి 25 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువట.
ఇళ్లలోకి వచ్చేసింది...
తమ పిల్లలు బుద్ధిమంతులనీ వారికి ఎలాంటి దురలవాట్లూ లేవనీ తల్లిదండ్రులు(parents be alert about drugs in hyderabad0 నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. ఎందుకంటే- మాదకద్రవ్యాల అలవాటు చాపకింద నీరులా నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి వచ్చేసింది... అంటారు ఓ డీ అడిక్షన్ సెంటర్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వప్న. సహజంగానే పిల్లలకు కుతూహలం ఎక్కువ. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు.
తల్లిదండ్రులు(parents be alert about drugs in hyderabad) విడిపోవడం, గొడవపడడం, అతి క్రమశిక్షణ, హాస్టల్లో ఉండటం లాంటివి కొంతవరకు కారణమైతే, అంతా కలిసే ఉంటున్నా తల్లిదండ్రులు తమ ఉద్యోగవ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణమట. కుటుంబసభ్యులంతా కలిసి సమయం గడపడం బాగా తగ్గిపోయిందనీ దాంతో పిల్లల ప్రవర్తనలో మార్పుల్ని గమనించలేకపోతున్నారనీ, మరోపక్క అవసరానికి మించి స్వేచ్ఛా డబ్బూ అందుబాటులో ఉండడం వారిని తప్పుదారి పట్టేలా చేస్తోందనీ అంటారు డాక్టర్ ప్రసాద్. పిల్లలు డ్రగ్స్ తీసుకోవటానికి అలవాటు పడ్డాక, డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదట. ఇక, రకరకాల డ్రగ్స్ మార్కెట్లో తేలిగ్గా దొరకడం సమాజం కల్పిస్తున్న వెసులుబాటు. దాంతో వీటికి అలవాటుపడినవారు తేలిగ్గా తమ స్నేహితులనూ దించుతున్నారు. సాధారణంగానే పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎక్కువ. డ్రగ్స్ తీసుకుంటే గొప్ప ఆలోచనలు వస్తాయనీ, ఏకాగ్రతతో బాగా చదువుకోవచ్చనీ చెప్పి ఆశపెడతారు. అమాయకులైన పిల్లలు అవన్నీ అబద్ధాలని తెలియక నమ్మేస్తారు. చాలావరకూ డ్రగ్స్ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారు. పది పాకెట్లు అమ్మితే ఒకటి ఉచితంగా ఇస్తామని వీరు పేద పిల్లలకు ఆశపెడతారు. దాంతో మొదట డబ్బు సంపాదనకోసం మొదలుపెట్టినవారు కూడా తర్వాత వాడడం అలవాటుచేసుకుని తనకు సరకు కావాలంటే ఎక్కువ మందికి అమ్మాలి కాబట్టి కొత్తవాళ్లకి అలవాటు చేస్తుంటారు.
వ్యసనం
మొదట సరదాగా ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుందిలే అనుకుని మొదలుపెడతారు. కానీ మత్తు పదార్థం లక్షణమే అది కాబట్టి మళ్లీ మళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. దాంతో తీసుకునే సందర్భాలు పెరుగుతాయి. కొన్నాళ్లకి ఆ మోతాదు అలవాటైపోయి, తృప్తి కలగక ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అప్పటికి అది వ్యసనం స్థాయికి వెళ్లిపోతుంది. వాళ్ల ధ్యాస ఎప్పుడూ మళ్లీ దాన్ని ఎలా సంపాదించాలన్న దాని మీదే ఉంటుంది. ఎప్పుడన్నా ఇది మంచిది కాదు, నేను ఇందులోనుంచి బయటపడాలీ అనుకున్నా ఎంతోసేపు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. డబ్బు దొరక్కో, ఇంట్లోవాళ్లు కట్టడి చేస్తేనో కొంత కాలం ఉన్నా అవకాశం దొరకగానే మళ్లీ తీసుకుంటారు. జన్యుపరమైన కారణాలు కూడా వ్యసనానికి దారితీస్తాయి. తల్లిదండ్రులో తోడబుట్టినవారో మద్యపానం లాంటి వ్యసనాలు కలిగివుంటే ఆ కుటుంబంలో(parents be alert about drugs in hyderabad0 పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువ. డిప్రెషన్, ఏడీహెచ్‌డీ లాంటి మానసిక సమస్యలు ఉన్నవారిలోనూ వ్యసనాల రిస్క్ ఎక్కువ. డ్రగ్స్ అయినా, మద్యం అయినా ఎక్కడ దొరుకుతాయో అందరికీ తెలుసు. అయినా కొందరు మాత్రమే ఆ వ్యసనం బారిన పడడానికి పైన చెప్పిన కారణాల్లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే పిల్లల ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి.
కనిపెట్టవచ్చు..!
పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి వాళ్లు డ్రగ్స్ తీసుకుంటున్నారని కనిపెట్టవచ్చంటారు నిపుణులు. తీసుకునే డ్రగ్‌ని బట్టీ, శరీర తీరుని బట్టీ కొన్ని మారినా చాలావరకూ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉంటాయి. ఏ డ్రగ్‌కి అలవాటుపడినా చదువుమీదా పనిమీదా దృష్టి పెట్టలేరు.
- డ్రగ్ తీసుకున్నాక వేరే ఏ ఆలోచనా రాదు. ఏ పనీ చేయాలన్న ఉత్సాహం ఉండదు. ఒకలాంటి మత్తులో ఉండిపోతారు. తిండి సరిగా తినరు, తింటే వాంతులవుతాయి. బరువు తగ్గిపోతారు.
- తమ మీద తమకు శ్రద్ధ ఉండదు. శుభ్రంగా తయారవ్వరు. అన్నిటిలోనూ విపరీతమైన నిర్లక్ష్యం కన్పిస్తూ ఉంటుంది.
- అతిగా నిద్రపోతారు. కళ్లు ఎర్రబడతాయి. కొన్ని రకాల డ్రగ్స్‌కి నోరు పొడిబారుతుంది.
- చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారు. ఎవరితోనూ మాట్లాడరు. తమ గదిలోకి ఎవరినీ రానివ్వరు.
- ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. స్కూలుకి, కాలేజీకి వెళ్లరు. పెద్దవాళ్లయితే ఉద్యోగానికి వెళ్లరు. బాధ్యతారహితంగా కన్పిస్తారు.
- మాటకీ చేతకీ మధ్య సమన్వయం ఉండదు. దేనికీ త్వరగా స్పందించరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి.
- కొన్నిటివల్ల అతి చురుకుదనం, దుందుడుకుతనం వస్తాయి. కళ్లు విప్పార్చిచూస్తుంటారు. నిద్ర పోరు. ఎక్కువగా మాట్లాడతారు.
వీటిల్లో ఏ కొన్ని లక్షణాలు కన్పించినా వైద్యుల్ని సంప్రదించాలి.
పెద్దలకు కౌన్సెలింగ్
పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలియగానే పెద్దలు ఉలిక్కిపడతారు. తప్పు నీదంటే నీదంటూ భార్యాభర్తలు గొడవపడతారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని డాక్టరు దగ్గరికి వెళ్లడానికి సంకోచిస్తారు. పిల్లవాడిని కొట్టి తిట్టి గదిలో బంధించి అలవాటు మాన్పించాలని చూస్తారు. ఇవేవీ సమస్యను పరిష్కరించవు సరికదా ప్రాణాపాయానికి దారితీస్తాయి. డ్రగ్ ఎడిక్షన్ అనేది ఒక జబ్బు. డ్రగ్స్‌కి అలవాటుపడినవారిని రోగిలా చూడాలి కానీ నేరస్తుల్లా కాదు. ఆ జబ్బు నయమవ్వాలంటే కుటుంబసభ్యుల తోడ్పాటుతో పాటు చికిత్సా తప్పనిసరి. అందుకే వైద్యులు ముందు కుటుంబ సభ్యులందరికీ కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతారు. చాలావరకు డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు తాము ఎప్పుడైనా మానేయగలమనీ, అది సమస్య కానే కాదనీ అంటారు. అది నమ్మి కుటుంబసభ్యులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లకుండా ఊరుకుంటే సమస్య తీవ్రమవుతుంది.
మాదకద్రవ్యాలే కాదు, ఒకోసారి అనారోగ్యానికి చికిత్సకోసం వాడే మందులు కూడా అడిక్షన్‌కి దారితీస్తాయి. దీర్ఘకాలం వ్యాధులతోనో వైకల్యంతోనో బాధపడేవారికి ఇచ్చే నొప్పి నివారణ మందులూ, మానసిక సమస్యలకు వాడే మందులతోనూ ఆ ప్రమాదం ఉంది. అవి వేసుకున్నప్పుడు ఉపశమనంగా ఉంది కాబట్టి అవసరం లేక పోయినా వేసుకుంటూ చివరికి అవి లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తారు. అది కూడా ఒక రకమైన డ్రగ్ ఎడిక్షన్ కిందికే వస్తుంది. కుటుంబసభ్యులు గమనించి వైద్యుల దృష్టికి తేవడం అవసరం. అవి డాక్టర్ ఇచ్చిన మందులే కదా వేసుకుంటే ఏమవుతుందీ అనుకోకూడదు. అవసరం లేకుండా తీసుకునేవి ఏవైనా ఆరోగ్యానికి ప్రమాదమే. నూటికి నూరుశాతం నయమయ్యేవరకూ మందుల్నీ కౌన్సెలింగ్‌నీ నిర్లక్ష్యం చేయకూడదు. అలవాటు మళ్లీ తిరగబెట్టకుండా ఏంచేయాలో కూడా డాక్టర్లు చెబుతారు.
ప్రభావం- ప్రమాదం
డ్రగ్స్ ప్రభావం నేరుగా మెదడు మీద పడుతుంది. వయసు, లైంగికత, సామాజిక హోదా ఏవీ వాటికి అడ్డుకావు. చిన్నవయసులో డ్రగ్స్ తీసుకుంటే ఆ ప్రభావం ఎదిగే మెదడు మీద తీవ్రంగా ఉంటుంది. కొకైన్ లాంటివీ, పొగరూపంలోనూ ఇంజెక్షన్ రూపంలోనూ తీసుకునేవీ వేగంగా వ్యసనానికి దారితీస్తాయి. ఆరోగ్యం మీద ఒక్కోటీ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతాయి.
* మెత్, ఓపియేట్స్, కొకైన్ లాంటివి సైకోటిక్ బిహేవియర్ (మతి చలించినట్లు, బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లు ప్రవర్తించడం)కి దారితీస్తాయి. ఫిట్స్ వస్తాయి. అధిక మోతాదులో తీసుకుంటే మరణం కూడా సంభవించవచ్చు.
* జీహెచ్‌బీ లాంటి రిక్రియేషనల్ డ్రగ్స్ వల్ల్ల జ్ఞాపకశక్తి పోతుంది. ఆల్కహాల్‌తో పాటు తీసుకుంటే ఫిట్స్ ఎక్కువై కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది.
* హెరాయిన్‌కి అలవాటుపడితే గుండె, ఊపిరితిత్తులూ దెబ్బతింటాయి. మరికొన్నిటివల్ల మూత్రపిండాలూ కాలేయమూ చెడిపోతాయి.
*ఎండీఎంఏ, ఎక్ట్ససీ లాంటి వాటివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయి. క్రమంగా మెదడు దెబ్బతింటుంది.
* పబ్స్, క్లబ్స్, రేవ్ పార్టీలలో ద్రవరూపంలోనూ పొడి లేదా పిల్స్ రూపంలోనూ ఉండే డ్రగ్స్ వాడతారు. వాటి ప్రభావానికి తోడు రసాయనాల కల్తీ వల్ల ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి.
* ఇంజెక్షన్ల వల్ల హెచ్‌ఐవీ లాంటి అంటు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.
* మత్తు ప్రభావంలో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతారు.
* ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. వ్యక్తిగత, ఉద్యోగ సంబంధాలు దెబ్బతింటాయి.
మన చేతుల్లో..
పిల్లలు డ్రగ్స్‌కి అలవాటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతా, ఒకవేళ అలవాటు పడినా కంగారు పడకుండా వారిని చికిత్సతో మామూలు మనుషుల్ని చేసుకోవాల్సిన బాధ్యతా తల్లిదండ్రులదే. అందుకు నిపుణులు చెబుతున్న సలహాలేంటంటే...
మాట్లాడండి: రోజూ కొంత సమయం పిల్లలతో గడపాలి. సందర్భాన్ని బట్టి మంచీ చెడూ చెబుతూ ఉంటే వ్యసనాల వల్ల నష్టాలేమిటో వారికి తెలుస్తాయి. పిల్లలు ప్రతి విషయాన్నీ స్వేచ్ఛగా చర్చించే వాతావరణం ఇంట్లో కల్పించాలి.
వినండి: పిల్లలు ఏం చెబుతున్నా జాగ్రత్తగా వినాలి. మాటల్లో వాళ్ల మానసిక పరిస్థితి తెలుస్తుంది. అప్పుడే ఏ సమస్యనైనా పరిస్థితి చేయి దాటిపోక ముందే పసిగట్టి జాగ్రత్తపడవచ్చు.
ఆచరించండి: పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదన్నది సామెత కాదు, సత్యం. పెద్దలు ఏ వ్యసనాలూ లేకుండా ఉంటే పిల్లలూ వాటికి దూరంగా ఉంటారు.
ఎక్కడ... ఎన్ని రకాలు?
స్కూళ్లూ కాలేజీల చుట్టుపక్కల ఉండే చిన్న హోటళ్లూ, కాలనీల్లోని కిరాణా దుకాణాలూ, పబ్‌లూ, ఆఖరికి మాల్స్‌తో సహా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. వీటిని ప్రధానంగా గంజాయి, పాపీ(గసగసాల జాతికి చెందినమొక్క), కొకా అనే మొక్కల నుంచి తయారుచేస్తారు. ఆ తయారీ క్రమంలో కలిపే పదార్థాలు వీటిని ప్రమాదకరంగా మార్చేస్తాయి. మార్జువానా, హషిష్, చరస్ అన్నీ వాటి రూపాలే. ఇవి కాకుండా మెత్, ఎండీఎంఏ, ఎక్ట్ససీ అని రకరకాల పేర్లతో పిలిచే సింథటిక్ డ్రగ్స్(రసాయనాలతో తయారైనవి) ఉంటాయి. హుక్కాతో పీల్చేవీ, ఇంజెక్షన్‌తో తీసుకునేవీ, నశ్యంలా ముక్కుతో పీల్చుకునేవీ, ట్యాబ్లెట్ల రూపంలో చప్పరించేవీ... రకరకాలుగా ఉంటాయి ఈ మాదకద్రవ్యాలు. ఏ రూపంలో ఉన్నా వాటి ప్రభావం మాత్రం మనసూ శరీరమూ రెండిటినీ పనిచేయకుండా చేస్తుంది.
మూడు రెట్లు ఎక్కువ!
మాదకద్రవ్యాల(parents be alert about drugs in hyderabad) అలవాటు విషయంలో దేశంలోని దాదాపు అన్ని నగరాలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం- మన దేశంలో మాదకద్రవ్యాల వినియోగం ప్రపంచ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువ. దేశంలో మత్తుకు అలవాటుపడ్డవారి సంఖ్య ఐదు కోట్ల పైనేననీ, ఒక్క మహారాష్ట్ర లోనే నెలకు 500 కిలోల మార్జువానా తింటున్నారనీ లెక్కలు చెబుతున్నాయి. మత్తు పదార్థాలకు మన నగరాలు పెద్ద మార్కెట్‌గా మారాయనీ అది ఇంకా ఇంకా పెరుగుతోందనీ ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం 50 ఆన్‌లైన్ క్రిప్టోమార్కెట్ వేదికల మీద మన దేశం నుంచి వెయ్యికి పైగా డ్రగ్ లిస్టింగ్స్ ఉన్నాయట. అంటే ఆన్‌లైన్‌లో కొంటే కొరియర్‌లో కోరిన అడ్రసుకి చేరవేస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు పెట్టుకుని మరీ ఫ్రెండ్స్ ఒకరికొకరు మాదకద్రవ్యాలను సరఫరా చేసుకుంటున్నారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ‘నశా ముక్త్ భారత్’ అని ఓ ప్రజాచైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉన్న 272 జిల్లాలమీద దృష్టి పెట్టి ఒక హెల్ప్‌లైన్‌ని నిర్వహిస్తోంది. ఈ హెల్ప్‌లైన్‌లో ఎప్పుడూ కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. రోజుకు అరవై డెబ్భై కాల్స్ దాకా వస్తున్నాయట. ఎలాగైనా ఈ అలవాటును వదిలించుకోవాలనుకున్న వాళ్లూ, వారి కుటుంబసభ్యులూ ఫోన్ చేసి మాట్లాడితే ఏం చేయాలో, పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో కౌన్సెలర్లు చెబుతారు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుల సహాయం తీసుకునేలా కౌన్సెలింగ్ ఇస్తారు.
పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ముందుగా అనుబంధాల మీద పెట్టుబడి పెట్టాలి. అందుకు కావలసింది... కుటుంబమంతా కలిసి గడిపే సమయం. మనసు విప్పి మాట్లాడుకునే స్వాతంత్య్రం. అది గుర్తుపెట్టుకుని ఆచరించేవారికి వ్యసనాలతో చేతులు కాలే పరిస్థితి రానే రాదు... ఏమంటారు?
ఇదీ చదవండి: తోకతో జన్మించిన శిశువు.. వైద్యుల ఆశ్చర్యం