గ్రామ సచివాలయాలకు పంచాయతీలతో సంబంధం లేదంటూనే వివిధ అవసరాల కోసం వాటి నిధులనే అధికారులు ఖర్చు చేయిస్తున్నారు. సచివాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) డ్రాయింగ్, డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్ (డీడీవో) అని చెబుతూనే సచివాలయాల్లో వివిధ వస్తువులను పంచాయతీ నిధులతో కొనుగోళ్ల కోసం కార్యదర్శులకు ఆదేశాలిస్తున్నారు. స్టేషనరీ నుంచి అంతర్జాలం ఛార్జీల వరకు గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. అధికారుల పరోక్ష ఆదేశాలతో పంచాయతీ నిధులను కార్యదర్శులు ఇప్పటివరకు వెచ్చిస్తున్నారు. గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఒకడుగు ముందుకేశారు. సచివాలయాల్లో వాలంటీర్ల కోసం పంచాయతీ నిధుల నుంచి బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేయాలని కార్యదర్శులకు సూచిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చారు.
పంచాయతీల జోక్యాన్ని నిరోధిస్తూ ఇలా...
రాష్ట్రంలో 2019 అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు సంబంధించి అప్పటికే 3నెలల క్రితం విడుదల చేసిన జీవో 110లో పంచాయతీ కార్యదర్శి సచివాలయాల్లో కన్వీనర్‌గా, డీడీవోగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయాల నిర్వహణ, పర్యవేక్షణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గ్రామ పంచాయతీల పాత్ర ఉంటుందని వివరించింది. ఉద్యోగులకు సంబంధించిన సాధారణ సెలవు (సీఎల్) సర్పంచి మంజూరు చేస్తారంది. పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాక మార్చి 25న ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోతో గ్రామ సచివాలయాల్లో సర్పంచి, కార్యదర్శి పాత్ర నామమాత్రమైంది. వీఆర్వోలు డీడీవోలుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. కార్యదర్శులు సచివాలయాల్లో లింక్ ఆఫీసర్‌గానే వ్యవహరిస్తారంది. సిబ్బంది సీఎల్ మంజూరుపై సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులకు వీఆర్వో పంపి అనుమతులు తీసుకుంటారని స్పష్టం చేసింది. సచివాలయాల నిర్వహణకు ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది.
ఇదీ చదవండి: pmay: ప్రతి అయిదింటిలో ఒక ఇల్లు రాష్ట్రానికే..