లాక్‌డౌన్‌తో నగరాలు, పట్టణాల్లో వ్యాపారాలు జరగడం లేదు. విద్యా సంస్థలు మూతపడే ఉన్నాయి. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఇక ఊరి నుంచి కదలడం ఎందుకని గ్రామీణులు భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినప్పటికీ వాటిలో పల్లెవెలుగు బస్సులు ఖాళీగానే కనిపిస్తున్నాయి.
ఈ నెల 21 నుంచి బస్ సర్వీసులు పునరుద్ధరించారు. రాష్ట్రంలో నిత్యం సగటున 1400-1500 బస్ సర్వీసులు నడుపుతుండగా, వీటిలో సగం పల్లెవెలుగులే. మొత్తం సర్వీసుల్లో 17 శాతం ఆరంభించగా, రద్దీని బట్టి పెంచాలని భావించారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు సర్వీసుల్లో రద్దీ కాదు కదా, బస్సులో సీట్లు కూడా పూర్తిగా నిండటం లేదు. ఈ బస్సుల్లో 60 సీట్లుంటాయి. భౌతికదూరం పాటించాలని 36 సీట్లలోనే ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కానీ 10-15 సీట్లకు మించి నిండటం లేదని అధికారులు చెబుతున్నారు.
పట్టణాలు, నగరాలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం, స్టాపులు కూడా తక్కువగా ఉండటంతో వీటిలో ప్రయాణించేందుకు పల్లె ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గ్రామాల నుంచి విజయవాడ, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి నగరాలకు వచ్చినా అక్కడ సిటీ బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఊరు దాటి రావడం లేదు. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున అత్యవసరమైతే తప్ప చాలామంది బయటికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో మాత్రం ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది.
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్లన్నీ నిండుతున్నాయి. విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు 20 సర్వీసులు నడుపుతున్నారు. సీమ నుంచి విజయవాడకు మరో 30 సర్వీసులు తిప్పుతున్నారు. తొలుత జిల్లాల నుంచి విజయవాడకు ఒకటి, రెండు సర్వీసులే నడిపితే సరిపోతుందనుకున్నా... డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సంఖ్య పెంచారు. విజయవాడ - విశాఖ మధ్య తొలుత 10-15 సర్వీసులే నడిపారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకునేవారు అధికంగా ఉండటంతో 80 వరకు పెంచారు. వేర్వేరు జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లోనూ రద్దీ ఉంటోంది. విజయవాడ నుంచి విశాఖకు ఏసీ సర్వీసులు కూడా ఆదివారం నుంచి ఆరంభించారు.
ఇదీ చదవండి :