భాగ్యనగరంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు కలవరపరుస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఘటనను మరువకముందే మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం ఉదంతం పోలీసులను ఉలికిపాటుకు గురిచేసింది. మూడేళ్ల కిందట జరిగిన దిశ సామూహిక హత్యాచారం తర్వాత జూబ్లీహిల్స్ ఘటన ఆ స్థాయిలో చర్చనీయాంశమైంది. 2020లో రాష్ట్రంలో 1934 అత్యాచార ఘటనలు నమోదు కాగా 2021లో అవి 2382కు పెరిగాయి. ఏడాది కాలంలో నాలుగో వంతు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అత్యాచార ఘటనలను పోలీసులు విశ్లేషించినప్పుడు పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 99% కేసుల్లో బాధితులకు పరిచయం ఉన్నవారే అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
గత ఏడాది నమోదైన 2382 ఘటనల్లో 69 శాతం కేసులలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారాలకు పాల్పడ్డట్లు వెల్లడయింది. 17 శాతం పక్కింటివారు, సహోద్యోగులు అదను చూసి లైంగికదాడి చేసినట్లు తేలగా, 11 శాతం కేసులలో బంధువులు, కుటుంబసభ్యులు, రెండు శాతం కేసులలో స్నేహితులే అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తేలింది. కేవలం ఒక్క శాతం కేసులలో మాత్రమే బాధితులకు నిందితులు పరిచయం లేనివారని వెల్లడైంది.
కట్టడిపై కన్ను.. యువతులు, మహిళల్లో అవగాహన పెంచడం ద్వారా అత్యాచార ఘటనలను కొంతమేర నిరోధించవచ్చని పోలీసులు చెబుతున్నారు. మహిళలపై జరుగుతున్న రకరకాల వేధింపుల గురించి వారిని చైతన్యవంతం చేసేందుకు పోలీసు మహిళా భద్రతా విభాగం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. అత్యాచారాలకు దారితీసే పరిస్థితులు, కారణాలను వివరిస్తూ వీటి బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఇకపై ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. కామాంధులు ఎలాంటి ప్రలోభాలకు గురిచేస్తారు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, పోలీసుల నుంచి సాయం ఎలా పొందాలనే అంశాలు వివరించనున్నారు.
ఇవీ చదవండి:
జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు
జూబ్లీహిల్స్ ఘటన మాదిరిగానే పాతబస్తీలో మరో రేప్.. రెండు కేసుల్లోనూ అవన్నీ సేమ్!