వర్షాలు ప్రభావం వల్ల ఉల్లి ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. ఒకపక్క కరోనా మరో ఈ వరదలతో అల్లాడుతున్న సామాన్యప్రజలకు పూటగడవడానికే భారమవుతున్న వేళ నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లి ధర గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈధరలు ఇలా మండిపోతుంటే కొనుడెట్లా తినుడెట్లా అని పేదలు ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రైతుబజార్లలోనే రూ.60 పెరిగింది. ఈ నెల 19న హైదరాబాద్ రైతుబజార్లలో కిలో ధర రూ.24 ఉండగా మంగళవారం రూ.84కి చేరింది.
దక్షిణాదిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మార్కెట్‌కు పంట రావడం లేదని హైదరాబాద్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్యలింగం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఉల్లిగడ్డ పంట క్షేత్రాలన్నీ మునిగిపోవడం వల్ల ఎక్కువ పంట కుళ్లిపోయింది. వానాకాలంలో ఏపీలో 15 వేలు, తెలంగాణలో 5,500 హెక్టార్లలో ఉల్లి సాగుచేసినా పెద్దగా పంట రాలేదు.
రాయలసీమలోని కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, కర్ణాటకలోని రాయచూర్, బాగల్‌కోట్, తెలంగాణలో మహబూబ్‌నగర్, అలంపూర్, గద్వాల, ఐజ తదితర ప్రాంతాల్లో ఉల్లి చేలలో నుంచి నీరు బయటకు పంపే అవకాశాల్లేకపోవడంతో దెబ్బతింది. కూలీల ఖర్చు వృథా అన్న ఉద్దేశంతో అధిక శాతం రైతులు ఆ పంటను తవ్వకుండానే దున్నేశారు.
ఎకరం విస్తీర్ణంలో ఉల్లిగడ్డ పంట సాగు చేయాలంటే రూ.50 వేల నుంచి 60 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. పంట చేతికొచ్చే దశలో.. ప్రకృతి ప్రకోపానికి పంటంతా దెబ్బతినడం వల్ల రైతుల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. కుదుటపడ్డాక మళ్లీ పంట వేద్దామంటే కిలో విత్తనం రూ.2000కు పైగా చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.