Twin reservoirs: ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన జలాశయాలు.. ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటం, వరద నీరు పోటెత్తడంతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకూ వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 250 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 312 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786గా ఉంది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ఒక గేటును 2 అడుగుల మీర ఎత్తిని నీటిని మూసిలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు మాత్రం వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 500 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 512 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1760.55 అడుగులుగా ఉంది. హిమాయత్‌సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టడంతో రెండు గేట్ల ఎత్తును అధికారులు తగ్గించారు.
ఇవీ చూడండి..