Karthika Deepotsavam Program Organized by ETV Channels : కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని మొగల్‌రాజపురం వి.పి.సిద్ధార్ధ పబ్లిక్ స్కూలు మైదానంలో కార్తిక దీపోత్సవం ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలియుగం, కలి ప్రభావం, భగవదనుగ్రహం తేలికగా పొందే మార్గం అంశంపై వేదాంతం రాజగోపాలచక్రవర్తి ప్రవచనం చేశారు. అలాగే వేదపండితుల ఆధ్వర్యంలో దుర్గా అష్టోత్తర పూజా కార్యక్రమం జరిగింది.
పండితుల వేద పటనం, గౌరీ అష్టోత్తర పారాయణం, కార్తీక మాసం విశిష్టత, గరుడ పురాణం, కార్తికంలో దీప జ్యోతి వెలిగించడం వల్ల శివ కేశవుల అనుగ్రహం ఎలా పొందవచ్చు తదితర అంశాలను పండితులు వివరించారు. మహిళలు, యువతులు అత్యంత భక్తి ప్రపుత్తులతో దీపోత్సవంలో పాల్గొన్నారు. కార్తిక దీపోత్సవానికి మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి తరలివచ్చారు. గాయనీ గాయకులు హృద్యంగా గేయాలు ఆలపించారు. ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో దీపోత్సవం ఘనంగా నిర్వహించారని ప్రజా ప్రతినిధులు, భక్తులు, వివిధ సంస్థల ప్రతినిధులు కొనియాడారు.