రష్యా-ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో ఒక్కసారిగా వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. దాదాపు 70 నుంచి 80 రూపాయల వరకు వంటనూనెల ధరలు పెరిగిపోయాయి. అధిక మొత్తం చెల్లించి కొందామన్నా...మార్కెట్‌లో నిల్వలు నిండుకున్నాయి. దిగుమతులు తగ్గిపోయి...గిరాకీ పెరిగిపోవడంతో ఇష్టానుసారం ధరలు పెంచేశారు. ప్రస్తుతం సన్ ఫ్లవర్ నూనె 200 మార్కును తాకుతోంది. వేరుశనగనూనె 180, పామాయిల్ 160 రూపాయలు దాటిపోయింది. అధిక ధరలు, గిరాకీని తగ్గించే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ హోల్ సేల్ డీలర్లతో సంప్రదింపుల తర్వాత... గుంటూరులో రెండు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా విక్రయాలు జరుపుతున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులేదని వినియోగధారులు వాపోతున్నారు.
అధిక ధరలను నియంత్రించేందుకు, అక్రమ నిల్వలను నిరోధించేందుకు విజిలెన్స్, ఇతర శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం హోల్ సేల్ దుకాణదారుడు 30 టన్నుల వరకు, రిటైల్ దుకాణదారుడు 3 టన్నుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. వీటికి విరుద్ధంగా అక్రమ నిల్వలు కలిగిన 9 మంది వ్యాపారులపైనా, అధిక ధరలకు విక్రయిస్తున్న మరో 114 మందిపై కేసులు నమోదు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు నూనె విక్రయిస్తే బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్సు ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: Nara Lokesh : సీఎం జగన్కు నారా లోకేశ్ సవాల్.. ఏమన్నారంటే?