రాష్ట్రంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 3,291 పంచాయతీల్లో 522 (15.86 శాతం) ఏకగ్రీవమయ్యాయి. వీరిలో 486 (93.10 శాతం) మంది వైకాపా మద్దతుదారులు, 23 మంది (4.40 శాతం) తెదేపా సానుభూతిపరులు, స్వతంత్రులు/తటస్థులు 12 మంది (2.29 శాతం), భాజపా మద్దతుదారు ఒకరు (0.19 శాతం) సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రెండో విడత ఎన్నికలకు సంబంధించి సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణతో కొన్ని పంచాయతీల్లో పోటీలో ఒకే అభ్యర్థి మిగలటంతో ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. బెదిరింపులు, హెచ్చరికలు, ప్రలోభాలు, సంప్రదింపులు, అనధికారిక ఒప్పందాలు ఇలా వివిధ కారణాలతో పలువురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొదటి, రెండో విడతలో కలిపి ఇప్పటివరకూ మొత్తం 1,047 (తొలి విడతలో-525, రెండో విడతలో-522) పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
* రెండో విడతలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 70, గుంటూరులో 70, విజయనగరంలో 60, కర్నూలులో 57 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఏకగ్రీవాల్లో 257 (49.23 శాతం) ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే జరిగాయి. పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో అతి తక్కువగా 15 పంచాయతీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి.
* మొదటి, రెండో విడతల్లో కలిపి మొత్తం 1,047 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఆ జాబితాలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 165, గుంటూరులో 137, కర్నూలులో 109 పంచాయతీలున్నాయి.
* రెండో విడతలో తూర్పుగోదావరి జిల్లా రాయవరం పంచాయతీలో భాజపా మద్దతుదారు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
* నియోజకవర్గాల వారీగా రెండో విడతలో అత్యధికంగా కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో 46 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 29, నరసరావుపేట నియోజకవర్గంలో 26 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
రెండో విడతలో నియోజకవర్గాల వారీగా ఏకగ్రీవాల వివరాలు:
* శ్రీకాకుళం: పలాస-14, ఇచ్ఛాపురం-9, రాజాం-8
* విజయనగరం: పార్వతీపురం-20, సాలూరు-19, కురుపాం-11, బొబ్బిలి-10
* విశాఖపట్నం: పాయకరావుపేట-12, చోడవరం-6, నర్సీపట్నం-4
* తూర్పుగోదావరి: రామచంద్రాపురం-5, మండపేట-5, రాజానగరం-3, అనపర్తి-2, కొత్తపేట-1, రాజమహేంద్రవరం గ్రామీణ-1
* పశ్చిమగోదావరి: నిడదవోలు-5, ఆచంట-5, తణుకు-4, కొవ్వూరు-1
* కృష్ణా: కైకలూరు-19, గుడివాడ-11, పామర్రు-7
* గుంటూరు: నరసరావుపేట-26, వినుకొండ-25, చిలకలూరిపేట-12, సత్తెనపల్లి-7
* ప్రకాశం: అద్దంకి-29, దర్శి-22, మార్కాపురం-11, కొండెపి-8
* నెల్లూరు: ఆత్మకూరు-29, ఉదయగిరి-6
* చిత్తూరు: పీలేరు-19, తంబళ్లపల్లె-19, చంద్రగిరి-8, మదనపల్లె-7
* కడప: కమలాపురం-22, రాయచోటి-18
* కర్నూలు: బనగానపల్లె-46,పాణ్యం-8, కోడుమూరు-3
* అనంతపురం: ధర్మవరం-7, కల్యాణదుర్గం-3, రాయదుర్గం-2, రాప్తాడు-2, ఉరవకొండ-1
(వీటిల్లో కొన్ని నియోజకవర్గాల పరిధిలోని ఒక్క మండలంలోనే రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి)
ఇదీ చదవండి: తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం