హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తూ.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఎస్.కె.హైదర్.. ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతను హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లుగా అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సహకారాన్ని కోరారు. గ్యాంగ్‌స్టర్ ఎస్.కె.హైదర్ తన ఏడుగురు అనుచరులతో కలిసి 2005లో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఎస్.కె.సులేమాన్ అనే వ్యక్తి సోదరుడు ఎస్.కె.చూనాను అతి దారుణంగా హత్య చేశాడు. అదే ఏడాది నాగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు ఏడుగురు అనుచరులకు 2011లో అడిషనల్ సెషన్ జడ్జి కోర్టు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.
ఇలా తప్పించుకున్నాడు
2007లో మహాపుత్రలో మైన్స్ ట్రేడర్ రష్మీరంజన్‌ను హత్య చేసిన కేసులో కూడా 2015లో పదేళ్ల జైలు శిక్ష పడింది. జైలులో ఉన్న హైదర్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతన్ని కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సర్జరీ వార్డు క్యాబిన్ నెంబరు 5లో చేర్పించారు. ఆరుగురు పోలీసులను కాపలా ఉంచారు. ఈ నెల 10వ తేదీన హైదర్ అక్కడున్న పోలీసులకు మత్తుమందునిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకుపోయాడు. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు పోలీసులను సంబల్‌పూర్ ఎస్పీ బత్తుల గంగాధర్ సస్పెండ్ చేసేశారు. వెంటనే ఒడిశా డీజీపీ భువనేశ్వర్ కటక్ పోలీసు కమిషనర్ ఎస్.కె.ప్రియదర్శి, క్రైం బ్రాంచ్ ఏడీజీ వై.కె.జెత్వా, సెంట్రల్ రేంజ్ డీఐజీ జైనారాయణ పంకజ్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
రంగంలోకి స్పెషల్ ఫోర్స్
హైదర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అతడు ఓ తెల్ల కారు(ఓడీ 02 ఏఎస్ 6770)లో హైదరాబాద్‌కు వచ్చినట్లుగా ఒడిశా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఎవరికైనా హైదర్ ఆచూకీ తెలిస్తే 94906 16640 ఫోన్ నెంబరులో సమాచారం అందించాలని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారి కోరారు.
ఇదీ చదవండి:
తుపాకీ మిస్‌ఫైర్: హోంగార్డు భార్య మృతి.. వెలుగులోకి కొత్తకోణం