Vallabhaneni Vamsi Followers Arrested in Krishna District : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. 2014 జనవరి 21వ తేదీన గన్నవరం పీఏసీఎస్ఓ (PACSO) మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు.
గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. వంశీ అనచురుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నీరుగార్చింది. ఇప్పటికి కేసులో కదలిక వచ్చింది. గన్నవరం పోలీసు స్టేషన్‌లో గత ఏడాది క్రైంనెంబరు 42గా ఈ దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు.
ఎంపీడీవోపై దాడి - విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్
వారిపై సెక్షన్ 326, 120 బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎనిమిది బృందాలతో ఏకకాలంలో పోలీసులు ఇవాళ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులైన ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి, భీమవరపు యేతంధ్ర రామకృష్ణ అలియాస్ రాము, మేచినేని బాబు, సూరపనేని అనీల్, గోన్నూరి సీమయ్య, గుర్రం నానీని అరెస్టు చేశారు. కొందరిని కంకిపాడు స్టేషన్‌కు తరలించగా మరికొందరు వేరే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.
వంశీ మరో ప్రధాన అనుచరుడు శేషు తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శేషు కోసం గాలిస్తున్నారు. ఈ దాడి వెనుక కీలక సూత్రధారిగా ఎవరు? అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
అంబటి హింట్ - 'నా ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చెయ్యండి' - షాకిచ్చిన పోలీసులు