Cotton Farmers Facing Difficulties with Behavior of CCI Officials : ప్రకృతితో సహా పరిస్థితులన్నీ పత్తి రైతులకు ప్రతికూలంగా మారాయి. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతులకు పంట అమ్ముకుందామంటే సీసీఐ విధిస్తున్న నిబంధనలు మరింత కుంగదీస్తున్నాయి. సీసీఐ వైఖరితో పత్తి రైతులు తమ పంటను జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తేమ శాతాన్ని12 నుంచి 15 కు పెంచకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు కలత చెందుతున్నారు.
కాస్త అటూ ఇటూ అయితే ధర తగ్గింపు : గతేడాది మిరప పంట వేసి నష్టపోయిన అన్నదాతలు ఈసారి ఎన్నో ఆశలతో పత్తి సాగు చేశారు. సెప్టెంబరు, అక్టోబరులోని అకాల వర్షాలు పత్తి రైతుల దిగుబడి ఆశల్ని చిదిమేశాయి. చేలల్లో నీరు చేరడంతో వేరు సంబంధిత తెగుళ్లు విజృంభించాయి. ఫలితంగా ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 12క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమవడం రైతులను కుంగదీసింది. పత్తికి కేంద్రం క్వింటాకు రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. పంటలో తేమ శాతం 8 నుంచి 12 శాతం లోపే ఉంటేనే మద్దతు ధర ఇస్తామని తెలిపింది. తేమ పరంగా, పింజ పొడువు పరంగా కాస్త అటూ ఇటూ అయితే ధర తగ్గించేస్తున్నారు.
రాష్ట్రంలో సగానికి తగ్గిన తెల్ల బంగారం సాగు - సహకరించని ప్రకృతి, ఆదుకోని పాలకులు
జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్ముక్కై : ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, పేరేచర్ల, గణపవరం, సత్తెనపల్లి ఇలా పలు చోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీఐ కేంద్రాల వద్ద విక్రయిస్తే కనీస మద్దతు ధర వస్తుందనే ఆశతో రైతులు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలు కూర్చి పంట తీసుకువస్తున్నారు. CCI కేంద్రాల వద్ద తేమ శాతం 12కు కొంచం పెరిగినా ససేమిరా అనడంతో తిరిగి పంటను తీసుకెళ్లలేక మద్దతు ధర కంటే తక్కువకే మిల్లులకు విక్రయిస్తున్నారు. చాలాచోట్ల జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. CCI కొర్రీలతో రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద కాంటా పెడుతున్నారు. సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులతో కుమ్ముక్కై పత్తిని కొనుగోలు చేయకుండా తేమశాతం పేరుతో తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది : CCI కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆందోళనల విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిగాజ్ సింగ్, సీసీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లపై గుంటూరు CCI అధికారులు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని రైతులవద్ద పత్తి ఉన్నంతవరకు కొనుగోళ్లు చేస్తామని విజయవాడ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు.. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇంటి ముట్టడి
Diseases Effect On Cotton: గులాబీ పురుగుతో అసలుకే ఎసరు.. పత్తి రైతులకు నిరాశే