తెలంగాణ రాష్ట్రంలో మురుసుపట్టింది. చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాష్ట్రంలోని 646 ప్రాంతాల్లో వాన పడింది. అత్యధికంగా కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), నల్గొండ పట్టణంలో 11 సెం.మీల చొప్పున, వాజేడు (ములుగు), బంట్వారం (వికారాబాద్)లలో 9 సెం.మీ, ధర్మవరం (ములుగు) 8.3 సెం.మీ, రెబ్బెన (కుమురం భీం)లో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 13.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు జలమయమవ్వడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునిగాయి.
హైదరాబాద్‌లో కుండపోత..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జంటనగరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం చిరుజల్లులతో మొదలైన వాన మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుంది. మధ్యాహ్నం తర్వాత తిరిగి మొదలై అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో వర్షం పడింది. పటాన్‌చెరు, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో మోస్తరు వర్షం కురిసింది.
ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, నాంపల్లిలో రహదారులు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీల్లోంచి నీరు ప్రవహిస్తోంది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి... ఎల్బీనగర్ జోన్ పరిధి నాగోల్ వార్డు పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
30 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం ..
నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పదకొండు గంటల వరకు 30మిల్లిమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి నాలాలు, మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు లేకుండా గుంతలు, మ్యాన్ హోళ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బలహీన పడిన అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర మీదుగా గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వివరించింది. వర్షాలతో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 5 డిగ్రీల వరకూ తగ్గడంతో చలిగా ఉంటోంది. పగలు సైతం 26 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న ఆకేరు వాగు..
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట వద్ద ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెక్ డ్యాములపై నుంచి అలుగు పారుతూ సందర్శకులను కట్టి పడేస్తోంది. వరంగల్ భద్రకాళి చెరువు వర్షాలకు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మత్తడి పోస్తుండగా... సందర్శకులకు ఆహ్లాదకరంగా మారింది.
జలాశయాలకు భారీగా వరద..
ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జలవనరుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరద వస్తోంది. 90 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 16.5 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలో వరద జలాలతో తొణికిసలాడుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది.
ఇవీ చూడండి: weather : బలహీనపడిన అల్పపీడనం..రెండురోజుల పాటు వర్షాలు